జానపండు తింటే ఇన్ని లాభాలా? చెట్టు విశేషం తెలిస్తే షాక్‌! | Round Leaf Cross Berry, Explore The Health Benefits, Uses And Unique Features Of The Wild Jana Fruit | Sakshi
Sakshi News home page

జానపండు తింటే ఇన్ని లాభాలా? చెట్టు విశేషం తెలిస్తే షాక్‌!

Sep 25 2026 10:03 AM | Updated on Sep 25 2026 10:21 AM

Jana Fruit Grewia Orbiculata Forest Fruit Telangana Andhra Pradesh

సాగుబడి

జానపండు

అడవి పండ్ల జాతి –20

English Name: Round Leaf Cross berry
శాస్త్రీయ నామం: గ్రేవియా అర్బికులేట
cientific Name: Grewia orbiculata Rottler   
Synonym (s): Grewia rotundifolia Juss.
కుటుంబం: టిలియేసి
Family: Tiliaceae

వివిధ భాషల్లో జానపండు పేర్లు:
అస్సామీస్‌ : పియల్‌ 
ఇంగ్లీష్‌ : రౌండ్‌ లెవిడ్‌ గ్రేవియా, రౌండ్‌ లీఫ్‌ క్రాస్‌ బెర్రి, ఇండియన్‌ లిండేన్‌ 
కన్నడ : కరిజాన
తమిళం : నెయి–సి–సిట్టే 
తెలుగు : జాన చెట్లు

పూత:
మార్చి–ఏప్రిల్‌ 
పండ్లు: జూన్‌ – జులై నెలల మధ్య  

జాన చెట్లు అన్ని ప్రాంతాల్లో పెరగవు. కాబట్టి దీన్ని గూర్చి ఇతర భాషల్లో అంతగా పేర్కొనలేదు. ఇవి కొన్ని ప్రదేశాలకే పరిమిత మైనట్లుగా ఉంది. దీని పండ్లు ఫాల్స పండ్లను పోలి ఉండి, 1–3 గింజలతో బూడిద రంగులో చిన్నవిగా ఉంటాయి. గ్రేవియా కుటుంబంలోని జీనస్‌లో దాదాపు 150 వరకు ఉప జాతులు ప్రపంచంలోని ఉష్ణ మండలపు అడవుల్లో ఉంటాయని అంచనా.

ఉనికి..
దీని స్వస్థలం ఇండియాగా గుర్తించారు. బంగ్లాదేశంలో వున్నాయని ఉవాచ! ఇండియాలో మాత్రం ఆకులురాల్చే అడవులున్న బీహార్, వెస్ట్‌ బెంగాల్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో విరివిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చెట్లు గుబ్బురుగా లేక గొడుగు ఆకారంలో దాదాపు 4 మీటర్ల ఎత్తు వరకు పెరగగలవు. జాన చెట్లు ఎండకాలంలో ఆకులను రాల్చి బోడగా మారతాయి. కొన్ని ప్రాంతాల్లో పూత మార్చి నెలలో మొదలై జులై వరకు పండ్లు ఉంటాయి.

ఉపయోగాలు... 
జాన పండ్ల చెట్టు ఆకులు పశువులకు మేతగా వాడతారు. జాన పండ్లను సేకరించి గ్రామాల్లో అమ్ముతుంటారు. కలపను వ్యవసాయ పనిముట్లకు వాడతారు. రక్తస్రావాన్ని అరికట్టడానికి ఉపయోగిస్తారు. పండ్లు పులుపు–తీపి కలబోసి రుచిగా ఉంటాయి. గింజ కొన్ని పండ్లల్లో గట్టిగా ఉన్నా తినవచ్చు. పిల్లలు బాగా ఇష్టపడే పండ్లల్లో ఇది ఒకటి. అడవులకు దగ్గరగా, అడవుల్లో ఉన్న గ్రామాల/తండా /గూడెం పిల్లలకు అక్కడ నివాసం ఉండే వారి మాటలను పొందుపరుస్తున్నాను. కడుపు నొప్పి తగ్గించడానికి నాటు వైద్యులు జాన పండ్లను వాడతారని అక్కడి (నల్లమల అడవుల) వారు అంటారు.

జాన చెట్లు ఆకులు, బెరడు, వేర్లలోని పోషక, ఔషధ విలువలపై పరిశోధనలు చేశారు. మచ్చుకు కొన్ని. వీటి ఆకుల్లో ఎండు పదార్ధం (94. 50%), బూడిద (12.67%), నత్రజని (2.10%), ముడి ప్రోటీన్లు (13.15), కొవ్వు (3.12%), ముడికొవ్వు (34.44%), పిండి పదార్థం (31.10%), నార (29.90%), ఎనర్జీ (204 కిలో కేలరీలు) వీటి ఆకుల్లోని మూలకాల్లో ఉన్నాయి (Source: Sonaane 2020, ఐ N: 2515–8260). కాబట్టి, ఔషధాల తయారీలో వీటి ఆకులకు, బెరడుకు ఎంతో విలువ.

వీటి పండ్లలో పోషక, మూలకాలు ఉండటం వల్ల, వీటిని తింటే ఆరోగ్యానికి మంచిది. ఎన్నో పోషకాలు, మినరల్స్, విటమిన్లు ఉన్న ఈ పండ్లపై సరైన పరిశోధనలు అవసరం ఎంతైనా ఉంది. నల్లమల అడవులే కాకుండా ఇతర తెలుగు రాష్ట్రాల్లోని అడవుల్లో జాన పొదలు, చెట్లు విరివిగా అగుపడతాయి. కానీ ఈ పండ్లు నిరాదరణకు గురయ్యాయని చెప్పవచ్చు. అనేక కారణాల వల్ల ఈ పండ్ల చెట్లు ఉనికి తగ్గి పోతుందనడంలో సందేహం లేదు.

వీటి పరిరక్షణ అందరి బాధ్యత. ఈ పండ్లపై పరిశోధకుల దృష్టి అంతగా లేదు. ఈ పండ్లలో ఉండే పోషక విలువలను గూర్చి, తగిన సమాచారం లేదు. దీన్ని బట్టి చూస్తే, ఇవి నిరాదరణకు లోనైనట్లు తెలుస్తుంది. పండ్ల దిగుబడి, నాణ్యతపై దృష్టిసారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కుటుంబంలోని చెట్లు, పొదలు, గుల్మముల రూపంలో ఉంటాయి. ఇవి మాత్రం ప్రపంచంలోని ఉష్ణ, ఉప–ఉష్ణ ప్రాంత అడవుల్లో విస్తరించి ఉన్నాయి.

- డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌. మొబైల్‌: 94407 08924

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

ఇదీ చదవండి: పుల్ల మజ్జిగతో మొక్కలకు భలే లాభాలు.. కానీ ఈ తప్పు చేయొద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement