పుట్టింది భువనేశ్వర్‌లో అయినా సంబల్‌పూర్, ఢిల్లీలలో పెరిగి 2012 నుంచి స్కూబా డైవింగ్‌ను అభిరుచిగా చేపట్టారు ప్రియదర్శి. ఆయన కుమార్తె టిస్య 2020లో తన 10వ ఏట ఒడిశాలోనే అత్యంత పిన్నవయస్కురాలైన స్కూబా డైవర్‌గా నిలిచారు, అలాగే 2022లో 12 ఏళ్ల వయసులో అత్యంత పిన్న వయస్కురాలైన ‘అడ్వాన్స్ డ్ ఓపెన్ వాటర్ డైవర్’గా గుర్తింపు పొందారు. 2025 జూన్ 8న, తన 15వ పుట్టినరోజున, టిస్య 100 అడుగుల లోతును చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలైన డైవర్‌గా రికార్డ్ నెలకొల్పారు.
‘నా కుమార్తె టిస్యతో కలిసి ‘ప్రపంచ టైగర్ షార్క్ రాజధాని’ మాల్దీవుల ఫువాములా ద్వీపంలో నీటి అడుగున భారీ టైగర్ షార్క్‌ల మధ్య డైవ్ చేయడం అద్భుత అనుభవం’’ అంటారు ఒడిశాకు చెందిన స్కూబా డైవర్, ప్రస్తుత దుబాయ్ వాసి ప్రియదర్శి పాణిగ్రాహి.‘‘చుట్టూ టైగర్ షార్క్‌ల మధ్య నాన్నతో కలిసి ఆయన 100వ డైవ్‌లో భాగం పంచుకోవడం... ఆయన డైవింగ్ సమయంలో తోడుండటం చాలా సంతోషాన్నిచ్చింది’’ అంటుంది ఆయన కుమార్తె టిస్య.
వీరిద్దరూ సముద్రపు అడుగుభాగంలో 15 అడుగుల పొడవు, వందల కి.గ్రా బరువు ఉన్న భారీ టైగర్ షార్క్‌లకు కొన్ని సెంటీమీటర్ల దూరంలో చక్కర్లు కొట్టారు. ఇది సాధించిన అరుదైన భారతీయ తండ్రీ కూతుళ్ల జంటగా నిలిచారు. ఈ నేప«థ్యంలో తమ స్కూబానుబంధం గురించి ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు పాణిగ్రాహి మాటల్లో..
స్నార్కెలింగ్ నుంచి, స్కూబా డైవింగ్ వైపు
తొలుత 2008లో భార్యతో కలిసి స్నార్కెలింగ్ చేస్తున్నప్పుడు చేపలు, జలచరాలు, కోరల్స్ అందాలతో నీటి అడుగున అద్భుత ప్రపంచాన్ని మరింత దగ్గరగా చూడాలనే గాఢమైన కోరిక పుట్టింది, దానికి స్కూబా డైవింగ్ ఒక్కటే మార్గం కాబట్టి 2012లో 36 ఏళ్ల వయసులో ఓపెన్ వాటర్ డైవింగ్ లైసెన్స్ తీసుకున్నాను.
కుమార్తె ఆరంగేట్రం ఇలా...
మా అమ్మాయి టిస్యా 10 ఏళ్ల వయసులో, సర్టిఫికేషన్ పొందిన తర్వాత చేసిన రెండో ప్రయత్నంలోనే మేమిద్దరం కలిసి డైవ్ చేశాం. ఆ సమయంలో ఒకరి చేతులు మరొకరం పట్టుకుని నీటిలోకి వెళ్లిన జ్ఞాపకం ఇప్పటికీ ఎప్పటికీ ప్రత్యేకమే. అప్పటినుంచి టిస్యాతో కలిసి పలు డైవింగ్ సాహసాల్లో ఎన్నో ఉత్కంఠభరితమైన, ఆనందకరమైన జ్ఞాపకాలను పంచుకున్నాం.
మాల్దీవుల డైవింగ్ ప్లేస్‌లలో ఫువాములా స్పెషల్...
ఫువాములా ఓపెన్ ఓషన్ లో ఉన్న ప్రత్యేకమైన సింగిల్–ఐలాండ్ అటాల్ (మధ్యలో నీళ్లు ఉండి దాని చుట్టూ రింగ్‌లా అల్లుకుని ఉండే పగడపు దీవి) అరుదైన సముద్ర జీవులను, ముఖ్యంగా టైగర్ షార్క్‌లను అయస్కాంతంలా ఆకట్టుకుంటుంది, దీని ప్రత్యేక భౌగోళిక స్వరూపం, అద్భుతమైన సముద్ర జీవ వైవిధ్యం, యునెస్కో బయోస్ఫియర్ హోదా ప్రధాన ఆకర్షణలు. స్థానిక హార్బర్ సమీపంలోని ‘టైగర్ హార్బర్’లో టైగర్ షార్క్‌లు తరచూ కనిపిస్తాయి. థ్రెషర్ షార్క్‌లు, హ్యామర్ హెడ్‌లు, వేల్ షార్క్‌లు, ఓషియానిక్ మాంటా రేస్, పైలట్ వేల్స్ కూడా కనిపిస్తాయి. దీనిలో కలిసి డైవ్ చేయడం మా ఇద్దరికీ జీవితకాల జ్ఞాపకం
టిస్యా భద్రత ముఖ్యం..
సురక్షితంగా, సుదీర్ఘ డైవింగ్ ఆనందించాలంటే మంచి శిక్షణ చాలా కీలకం. పేరున్న డైవింగ్ స్కూళ్లలో టిస్యాకు శిక్షణ ఇప్పించాను. అలాగే ఇద్దరం మంచి పేరున్న డైవింగ్ సెంటర్లతోనే డైవ్ చేస్తాం. అయితే భద్రత విషయంలో మొదటి బాధ్యత మనదే. అన్ని నియమాలను పాటించాలి, ఇన్ స్ట్రక్టర్ల సూచనలను శ్రద్ధగా వినాలి.
– సత్యబాబు, సాక్షి


