
టెక్నాలజీ అనేది చాలామంది పనులను వేగవంతం చేస్తుంది. దాంతోపాటు కొందరి ప్రాణాలు కోల్పోకుండా కాపాడుతుంది. అదెలాగని అనుకుంటున్నారా.. ఇటీవల బంగాళాఖాతంలో జరిగిన ఓ సంఘటన గురించి తెలియాల్సిందే. ఆ ఘటనలో ధరించగలిగే సాంకేతిక పరిజ్ఞానం (wearable technology) మరోసారి ప్రాణాలను రక్షించే సామర్థ్యాన్ని రుజువు చేసింది. పుదుచ్చేరి తీరంలో సంభవించిన స్కూబా డైవింగ్ ప్రమాదంలో యాపిల్ వాచ్ అల్ట్రా ముంబైకి చెందిన 26 ఏళ్ల టెక్కీని ఊహించని విధంగా కాపాడింది.
ఈ-కామర్స్ రంగంలో పనిచేస్తున్న, స్కూబా డైవింగ్‌పై ఆసక్తి ఉన్న క్షితిజ్(26) అనే వ్యక్తి ఇటీవల బంగాళాఖాతంలో డైవింగ్ కోసం వెళ్లాడు. తన కోచ్‌తో కలిసి సముద్రంలో సుమారు 36 మీటర్ల లోతుకు చేరుకున్నాడు. ఒక్కసారిగా సంద్రంలో పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. అది గమనించిన క్షితిజ్ పైకి రావాలని నిర్ణయించుకున్నాడు. కానీ డైవింగ్ కిట్‌లో ముఖ్యమైన భాగంగా ఉన్న అతని వెయిట్ బెల్ట్ (Weight Belt) వదులైంది. దాంతో కంగారుపడి మరింత వేగంగా పైకి రావడానికి ప్రయత్నించాడు.
నీటి అడుగున ఒత్తిడి మార్పుల కారణంగా డైవర్లు వేగంగా ఆరోహణ (Rapid Ascent) దిశగా లోతు నుంచి పైకి వచ్చే క్రమంలో ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవచ్చు. ఇది ఊపిరితిత్తుల ఓవర్ ఎక్స్‌పాన్షన్ ఇంజురీలకు దారితీస్తుంది. అదేమీ లెక్క చేయకుండా వేగంగా పైకి రావడానికి క్షితిజ్ ప్రయత్నించాడు. అప్పటికే అతడు సాహసోపేత క్రీడల కోసం రూపొందించిన యాపిల్ వాచ్ అల్ట్రాను ధరించాడు. అతను వేగంగా పైకి వెళ్తుండగా వాచ్‌లోని సెన్సార్లు ఉపరితలం నుంచి లోతు, తన వేగాన్ని పరిగణించి అసాధారణ మార్పును గుర్తించాయి. వాచ్ స్క్రీన్‌పై తక్షణమే ఒక హెచ్చరిక కనిపించింది. ‘నెమ్మదిగా ఉండండి. మీరు చాలా వేగంగా వెళ్తున్నారు’ అని మేసేజ్ రూపంలో వచ్చింది.
అయినప్పటికీ క్షితిజ్ పట్టించుకోకుండా వేగంగా వెళ్తున్నాడు. ఈ కీలక సమయంలో అత్యవసర పరిస్థితుల కోసం రూపొందించిన వాచ్ అల్ట్రా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ సైరన్ మోగించింది. దాని శబ్దం సముద్రంలో గందరగోళ వాతావరణంలో కూడా స్పష్టంగా వినిపించేలా ఉండడంతో ముందు వెళ్తున్న కోచ్ ఆ శబ్దం విని తన వద్దకు వచ్చాడు. కోచ్ జోక్యం చేసుకుని క్షితిజ్ పరిస్థితిని నియంత్రించాడు. సురక్షితంగా పైకి వచ్చేందుకు తోడ్పాటు అందించాడు. ‘ఆ వాచ్‌లో సైరన్ ఫీచర్ ఉందని కూడా నాకు తెలియదు’ అని క్షితిజ్ అంగీకరించాడు. ‘ఇది నా ప్రాణాలను కాపాడింది’ అని చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు