TGSRTC: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధం | TGSRTC Special Bus Buses Arrange For Sankranthi Festival | Sakshi
Sakshi News home page

TGSRTC: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధం

Jan 7 2026 4:40 PM | Updated on Jan 7 2026 5:05 PM

TGSRTC Special Bus Buses Arrange For Sankranthi Festival

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో సన్నద్దమైంది.  ఈ ఏడాది సంక్రాంతికి పండుగకు 6431 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసింది. అలాగే, ఈ నెల 18, 19 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి  సంబంధించి తగిన ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనుంది.

2003లో జీవో ప్రకారం ఛార్జీల పెంపు.. 
ప్రధాన పండుగులు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేనప్పటికీ రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన సంస్థ వెనక్కి తెప్పిస్తుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వాటిని ఆయా రూట్లలో నడిపిస్తుంది. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.5 రేట్ల వరకు టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ప్రతి ప్రధాన పండుగకు 1.5 రేట్ల వరకు టికెట్ ధరలను ఉమ్మడి కార్పొరేషన్‌గా ఉన్నప్పటి నుండి అమలు చేస్తుంది. టీజిఎస్ఆర్టీసీ ఏర్పడిన నాటి నుండి ప్రతి ప్రధాన పండుగకు దీన్ని అమలు చేస్తుంది.

ఆ బస్సుల్లో ఉచిత ప్రయాణం..
ఈ సంక్రాంతి పండుగకు నడిపే  ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 1.5 రేట్లు వరకు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయి.  ఈ నెల 9, 10, 12,13 తేదీలతో పాటు  తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 18, 19 తేదీల్లో మాత్రమే సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయి. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే  అమల్లో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుంది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను www.tgsrtcbus.in వెబ్ సైట్‌లో బుక్  చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లలో సంప్రదించాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement