విలువైన లోహంగానే కాకుండా పారిశ్రామిక అవసరాలకు కూడా కీలకంగా ఉంటున్న వెండి ప్రాసెసింగ్ సామర్థ్యాలను పెంచుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెట్టాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) సూచించింది. విదేశాల నుంచి దీర్ఘకాలికంగా సరఫరా, దేశీయంగా రిఫైనింగ్..రీసైక్లింగ్ సామర్థ్యాలను పెంచుకోవడంపై ఫోకస్ చేయాలని పేర్కొంది.
కొన్ని దేశాలపై మాత్రమే ఆధారపడకుండా మరిన్ని ప్రాంతాల నుంచి వెండిని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నించాలని సూచించింది. ఫినిష్డ్ సిల్వర్ దిగుమతులను తగ్గించుకోవాలని తెలిపింది. ఖనిజం నుంచి వెండిని ప్రాసెస్ చేసే ప్రక్రియపై భారత్ పట్టు సాధించాలని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు.
అంతర్జాతీయంగా వెండి ఖనిజ మార్కెట్ 6.3 బిలియన్ డాలర్లుగా ఉండగా, చైనా అత్యధికంగా ఏటా సుమారు 5.6 బిలియన్ డాలర్ల విలువ చేసే ఖనిజాన్ని దిగుమతి చేసుకుంటోందని పేర్కొన్నారు. దేశీయంగా దాన్ని శుద్ధి చేశాక, ఎల్రక్టానిక్స్, మెడికల్ డివైజ్‌లు, సోలార్ ప్యానెళ్లలో ఉపయోగించేందుకు వీలుగా, అధిక విలువ చేసే వెండి రూపంలో దాన్ని ఎగుమతి చేస్తోందని శ్రీవాస్తవ చెప్పారు.
భారత్ దానికి విరుద్ధంగా 2024లో 6.4 బిలియన్ డాలర్ల విలువ చేసే రిఫైన్డ్ వెండిని దిగుమతి చేసుకుందని, గ్లోబల్ ట్రేడ్‌లో ఇది 21.4 శాతమని వివరించారు. ఆ విధంగా ప్రాసెసర్‌గా కంటే ఫినిష్డ్ సిల్వర్‌కి అతి పెద్ద వినియోగదారుగా భారత్ నిల్చిందన్నారు. ఈ నేపథ్యంలో దేశీయంగా మరింత విలువ జోడించేందుకు ఖనిజ దశ నుంచి వెండిని ప్రాసెస్ చేసే ప్రక్రియపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని శ్రీవాస్తవ వివరించారు.
9 బిలియన్ డాలర్లకు దిగుమతులు..
2025 ఆర్థిక సంవత్సరంలో 4.83 బిలియన్ డాలర్ల వెండి ఉత్పత్తులు దిగుమతి చేసుకున్న భారత్ 478.4 మిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను మాత్రమే ఎగుమతి చేసిందని శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇక 2025 జనవరి–నవంబర్ మధ్య కాలంలో 8.5 బిలియన్ డాలర్ల విలువ చేసే వెండిని దిగుమతి చేసుకోగా, పూర్తి సంవత్సరానికి ఇది 9.2 బిలియన్ డాలర్లకు చేరనుందని తెలిపారు.
2024తో పోలిస్తే ఇది 44 శాతం అధికమని వివరించారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఇంధన భద్రత తరహాలోనే వెండి భద్రతను సాధించడం కూడా కీలకంగా మారిందని వివరించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా వెండికి నెలకొన్న డిమాండ్‌లో 55–60 శాతం వాటా ఎలక్ట్రానిక్స్, సౌర విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, డిఫెన్స్ పరికరాలు మొదలైన పారిశ్రామిక విభాగాల నుంచి ఉంటోంది.
గత రెండు దశాబ్దాలుగా వెండి ఖనిజం, కాన్సెంట్రేట్‌ల వాణిజ్యం 2000లో 0.1 బిలియన్ డాలర్లుగా ఉండగా 2024లో 6.27 బిలియన్ డాలర్లకు చేరింది. శుద్ధి చేసిన వెండి వ్యాపారం (కడ్డీలు, తీగలు మొదలైనవి) 2000లో 4.06 బిలియన్ డాలర్లుగా ఉండగా 2024లో 31.42 బిలియన్ డాలర్లకు చేరింది.


