పడగొట్టిన పశ్చిమాసియా | Sensex falls 1342 points | Sakshi
Sakshi News home page

పడగొట్టిన పశ్చిమాసియా

Mar 12 2026 2:50 AM | Updated on Mar 12 2026 2:50 AM

Sensex falls 1342 points

మార్కెట్లకు యుద్ధ భయం 

సెన్సెక్స్‌ 1,342 పాయింట్లు పతనం 

395 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 

76,864 – 23,867 వద్ద ముగింపు 

రూ. 5.14 లక్షల కోట్ల సంపద హుష్‌ 

ముంబై: యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పశ్చిమాసియాలో యుద్ధానికి త్వరలోనే ముగింపు పలకనున్నట్లు చేసిన ప్రకటనపై స్టాక్‌ మార్కెట్లు ఒక్క రోజులోనే విశ్వాసాన్ని కోల్పోయాయి. మరోపక్క ముడిచమురు ధరలు సైతం తిరిగి జోరందుకోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. వెరసి సెన్సెక్స్‌ 1,342 పాయింట్లు పతనమైంది. 76,864 వద్ద ముగిసింది. నిఫ్టీ 395 పాయింట్లు కోల్పోయి 23,867 వద్ద నిలిచింది. దీంతో బీఎస్‌ఈ మార్కెట్‌ విలువలో రూ. 5.14 లక్షల కోట్లు ఆవిరైంది.   

తొలుత ఆసియా మార్కెట్ల సానుకూలతలతో స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చమురు ధరల సెగతో వెనువెంటనే డీలా పడ్డాయి.  ఉదయం లండన్‌ మార్కెట్లలో బ్రెంట్‌ చమురు ధర పీపాకు 6 శాతం ఎగసింది. 93 డాలర్లకు చేరింది. యూరోపియన్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభంకావడంతో మిడ్‌సెషన్‌ నుంచీ సెంటిమెంటు మరింత బలహీనపడింది. ఫలితంగా సమయం గడిచేకొద్దీ అమ్మకాలు పెరిగిపోయాయి. దీంతో చివర్లో సెన్సెక్స్‌ 1,447 పాయింట్లు పడిపోయి 76,759ను తాకగా.. నిఫ్టీ 23,834వరకూ క్షీణించింది. 

ఫైనాన్స్, ఆటో వీక్‌..: ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్, రియల్టీ, కెమికల్స్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ 3–1% మధ్య నష్టపోయాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్‌ ఫైనాన్స్, యాక్సిస్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, ఐషర్, బజాజ్‌ ఆటో, కొటక్‌ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ, మారుతీ, శ్రీరామ్‌ ఫైనాన్స్, ట్రెంట్, టీఎంపీవీ, టీసీఎస్, ఎయిర్‌టెల్‌ 5–2% మధ్య డీలాపడ్డాయి..

గ్యాస్, జల్‌ జీవన్‌ పుష్‌.. 
గ్యాస్‌ కొరత ప్రభావంతో అదానీ టోటల్‌ గ్యాస్‌ 18 శాతం ఎగసింది, ఇండక్షన్‌ స్టవ్‌లకు డిమాండ్‌ పెరగడంతో టీటీకే ప్రెస్టీజ్, స్టవ్‌క్రాఫ్ట్‌ షేర్లు 12 శాతం చొప్పున జంప్‌చేశాయి. కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్‌ మిషన్‌కు మరింత మద్దతివ్వడంతో శక్తి పంప్స్, రోటో పంప్స్, జైన్‌ ఇరిగేషన్, జిందాల్‌ సా, ఎన్విరో ఇన్‌ఫ్రా, ఇండియన్‌ హ్యూమ్‌ పైప్, ఎస్‌పీఎంఎల్‌ తదితరాలు 20–13 శాతం మధ్య దూసుకెళ్లాయి.

సెడెమాక్‌ లిస్టింగ్‌ భేష్‌ 
పతన మార్కెట్లోనూ ఆటో విడిభాగాల(పవర్‌ట్రెయిన్‌ కంట్రోల్స్‌) తయారీ కంపెనీ సెడెమాక్‌ మెకట్రానిక్స్‌ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 1,352తో పోలిస్తే ఎన్‌ఎస్‌ఈలో రూ. 1,535 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇది 13.5 శాతం అధికం కాగా.. బీఎస్‌ఈలో 12 శాతం లాభంతో రూ. 1,510 వద్ద లిస్టయ్యింది. చివరికి 7.4 శాతం బలపడి రూ. 1,452 వద్ద ముగిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement