3 రోజుల్లోనే ఉద్యోగం పోతే.. ఈ ఏఐ ఇంజనీర్ ఏం చేసిందంటే.. | Fired in Just 3 Days AI Engineer Now Earns 8 Times More a Year Later | Sakshi
Sakshi News home page

3 రోజుల్లోనే ఉద్యోగం పోతే.. ఈ ఏఐ ఇంజనీర్ ఏం చేసిందంటే..

Mar 11 2026 9:06 PM | Updated on Mar 11 2026 10:07 PM

Fired in Just 3 Days AI Engineer Now Earns 8 Times More a Year Later

ఎన్నో ఆశలతో కొత్త ఉద్యోగంలో చేరతాం.. అలా చేరిన మూడు రోజుల్లోనే ఆ ఉద్యోగం ఊడిపోతే.. రీతూ మౌర్య అనే ఏఐ (AI) ఆటోమేషన్ ఇంజనీర్  తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇలాంటి కఠిన అనుభవాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఉద్యోగంలో చేరిన కేవలం మూడు రోజుల్లోనే క్లయింట్ ముందు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె తెలిపారు. అయితే ఏడాది తరువాత అదే రంగంలో మొదట ఆఫర్ చేసిన జీతానికి ఎనిమిది రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నానని పేర్కొంది. ఈ విజయానికి స్వీయ అభ్యాసం,  సరైన మార్గదర్శకత్వం కారణమని ఆమె చెప్పింది.

ప్రారంభంలోనే ఎదురైన చేదు అనుభవం
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో రీతూ మౌర్య తన అనుభవాన్ని పంచుకుంది. తనను ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు ప్రారంభంలో సంస్థ ఫౌండర్‌ తనకు కావాల్సిన సహాయం, మార్గదర్శకత్వం ఇస్తానని హామీ ఇచ్చాడని ఆమె తెలిపింది. కానీ వాస్తవానికి ఆమె సందేశాలకు గంటల తరువాత కానీ సమాధానం ఇచ్చేవాడు కాదని, సమస్యలు అర్థం చేసుకునేందుకు కాల్ చేయడానికీ ముందుకు రాలేదని చెప్పింది. “ఉద్యోగంలో రెండో రోజుకే నాకు చాలా విషయాలు తెలియకపోయాయి. మార్గదర్శనం చేస్తానని చెప్పినా, అతను ఎక్కడా కనిపించలేదు” అని మౌర్య తెలిపింది.

క్లయింట్ ముందు విమర్శలు… వెంటనే తొలగింపు
మూడో రోజు అసైన్‌మెంట్ సమయంలో వ్యవస్థాపకుడు క్లయింట్ ముందే ఆమె పనితీరును తీవ్రంగా విమర్శించాడని మౌర్య తెలిపింది. “మీరు పనిని సరిగ్గా చేయడం లేదు. నేను ఇదే పని ఒక గంటలో పూర్తి చేసేవాడిని. ఇకపై మనం కలిసి పనిచేయలేము” అని అతను చెప్పాడని ఆమె గుర్తుచేసుకుంది. ఆశ్చర్యకరంగా, అదే క్లయింట్ ఆమెను ఫుల్ టైమ్‌గా చేరగలరా అని అడిగిన మరుసటి రోజే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె వెల్లడించింది.

మానసికంగా తీవ్ర ప్రభావం
ఈ ఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని మౌర్య తెలిపింది. “అంతా శూన్యంగా అనిపించింది. చాలా రోజులు ఏడ్చాను. నేను ఏమీ చేయలేనన్న భావన కలిగింది” అని ఆమె చెప్పింది. ఈ అనుభవం చాలా కాలం పాటు తనను వెంటాడిందని కూడా పేర్కొంది.

మళ్లీ ప్రయాణం ప్రారంభం
అయితే తర్వాత ఆమె తనను తాను తిరిగి నిర్మించుకోవాలని నిర్ణయించుకుంది. ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ చూడడం, సహచరుల సహాయం కోరడం, అలాగే “తెలివితక్కువ ప్రశ్నలు అయినా అడగడం” ద్వారా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తన అభ్యాస ప్రయాణాన్ని లింక్డ్‌ఇన్‌లో పంచుకోవడం ప్రారంభించడంతో, చివరికి తనకు మరో సంస్థ అధినేత అవకాశం ఇచ్చారు.

ఏడాదిలో భారీ మార్పు
ఉద్యోగం కోల్పోయిన ఏడాది తరువాత ప్రస్తుతం తాను మొదట ఇచ్చిన ఆఫర్ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నానని మౌర్య తెలిపింది. “ఇప్పుడు అన్నీ చాలా బాగున్నాయి. అప్పటి విషపూరితమైన కార్యాలయం నుంచి బయటపడటం మంచిదే అనిపిస్తోంది” అని ఆమె పేర్కొంది.

నెటిజన్ల స్పందనలు
మౌర్య కథకు అనేక మంది టెక్ ప్రొఫెనల్స్‌ స్పందించారు. తమ కెరీర్ ప్రారంభంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. కొంతమంది అనుభవం లేని వ్యవస్థాపకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించగా, మరికొందరు స్పష్టత కోసం ప్రశ్నలు అడిగినందుకు విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. “అది ఐదేళ్ల క్రితం జరిగింది. ఇప్పటికీ కొన్నిసార్లు ఆ సంఘటన పీడకలలా అనిపిస్తుంది. కానీ చివరకు నేను తిరిగి లేచి నిలబడ్డాను” అని మరో టెక్ ఉద్యోగి కూడా తనకు జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement