చికెన్‌, పిజ్జా, బర్గర్‌.. కంపెనీలకు కష్టాలు | Gas Supply Disruption And Surging LPG Prices Weigh On India QSR Sector, Stocks Trade Mixed, More Details Inside | Sakshi
Sakshi News home page

చికెన్‌, పిజ్జా, బర్గర్‌.. కంపెనీలకు కష్టాలు

Mar 11 2026 3:03 PM | Updated on Mar 11 2026 3:50 PM

Gas Supply Disruption Clouds India QSR Sector LPG Prices Surge Stocks

దేశీయ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (క్యూఎస్‌ఆర్‌) విభాగంపై గ్యాస్ సెగ ముసురుతోంది. వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాలో ఏర్పడిన అంతరాయం, పెరుగుతున్న ధరల నేపథ్యంలో బుధవారం స్టాక్ మార్కెట్‌లో ప్రధాన క్యూఎస్‌ఆర్ కంపెనీల షేర్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. సరఫరా గొలుసులో తలెత్తిన సమస్యలు మరో రెండు వారాలకు పైగా కొనసాగితే కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

సరఫరా గొలుసులో సంక్షోభం

ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జేఎం ఫైనాన్షియల్ తాజా నివేదికలో క్యూఎస్‌ఆర్ విభాగం ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషించింది. ప్రధాన క్యూఎస్‌ఆర్ చైన్‌లో దాదాపు 60-65 శాతం వంట ప్రక్రియ పూర్తిగా ఎల్‌పీజీపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ సంస్థలు కేవలం ఒకటి నుంచి రెండు వారాలకు సరిపడా గ్యాస్ నిల్వలను మాత్రమే కలిగి ఉన్నాయి. సరఫరా లోటు కారణంగా మార్చి నెలలోనే వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర 8 శాతం మేర పెరిగింది. ఇది నేరుగా రెస్టారెంట్ల నిర్వహణ వ్యయాన్ని పెంచుతోంది.

ఆదాయం, మార్జిన్లపై ప్రభావం

ఒకవేళ సరఫరా నిలిచిపోయి, రెస్టారెంట్లు ఐదు రోజుల పాటు మూతపడితే ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. త్రైమాసిక ప్రాతిపదికన ప్రతి స్టోర్ ఆదాయం 6 శాతం తగ్గే అవకాశం ఉంది. రెస్టారెంట్ స్థాయి ఎబిటా మార్జిన్లు సాధారణం కంటే 14-20 శాతం మేర పడిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా ప్రభుత్వం గృహ అవసరాలకు వాడే గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలో వాణిజ్య వినియోగదారులపై రేషనింగ్(ప్రాధాన్యత క్రమంలో పరిమితంగా పంపిణీ చేయడం) విధించడం రెస్టారెంట్లకు శాపంగా మారింది.

ముంచుకొస్తున్న ముప్పు.. ప్రత్యామ్నాయం తప్పదా?

పెద్ద సంస్థల కంటే చిన్న, స్వతంత్ర రెస్టారెంట్లు ఈ సంక్షోభానికి త్వరగా ప్రభావితమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. హార్ముజ్ జలసంధి వంటి కీలక షిప్పింగ్ మార్గాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వల్ల ఎల్‌పీజీ దిగుమతులకు ఆటంకం కలుగుతోంది. ఈ అనిశ్చితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రెస్టారెంట్ విభాగం ప్రత్యామ్నాయ ఇంధన వనరులు (విద్యుత్ ఆధారిత వంట పరికరాలు) లేదా సెంట్రలైజ్డ్ కిచెన్ మౌలిక సదుపాయాల వైపు మళ్లక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement