మిడిల్‌ఈస్ట్ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడంతో ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాస్తోంది. దీనివల్ల ఇన్నాళ్లూ వడ్డీ రేట్ల తగ్గింపు కోసం వేచి చూసిన సామాన్యులకు, పెట్టుబడిదారులకు కేంద్ర బ్యాంకులు షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం పక్కన పెట్టి ఈ ఏడాది చివరి నాటికి మరింత పెంచే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అంచనాలు తలకిందులు
ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈ ఏడాది ఒకటి లేదా రెండుసార్లు వడ్డీ రేట్లను పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రేట్ల తగ్గింపు ఉంటుందని భావించినప్పటికీ చమురు, గ్యాస్ ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగడం దీనికి ప్రధాన కారణం. అదేవిధంగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా రేట్ల పెంపు దిశగా అడుగులు వేస్తోంది. గతంలో రేట్ల కోత ఉంటుందని ఊహించిన మార్కెట్ వర్గాలకు ఇది పెద్ద మలుపు.
గత తప్పిదాల నుంచి పాఠాలు
2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ద్రవ్యోల్బణంపై కేంద్ర బ్యాంకులు ఆలస్యంగా స్పందించాయనే విమర్శలు ఉన్నాయి. సాధారణంగా ఇంధన ధరల పెరుగుదల తాత్కాలికమని, అధిక ధరల వల్ల డిమాండ్ తగ్గి ధరలు అదుపులోకి వస్తాయని బ్యాంకర్లు భావిస్తారు. అయితే, గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఆలస్యం చేయకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సెంట్రల్ బ్యాంకులు భావిస్తున్నాయి.
బ్రిటన్‌లో సంక్లిష్ట పరిస్థితి
యూకేలో ద్రవ్యోల్బణం ప్రస్తుతం 3% వద్ద ఉంది. ఇది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(బీఓఈ) లక్ష్యం (2%) కంటే ఎక్కువ. యుగోవ్/ సిటీగ్రూప్ సర్వే ప్రకారం, ఇరాన్ యుద్ధానికి ముందే వినియోగదారుల ధరల పెరుగుదల 3.3%గా ఉంది. దీంతో బీఓఈ తన అంచనాలు మారుస్తోంది.
ఇదీ చదవండి: చికెన్, పిజ్జా, బర్గర్.. కంపెనీలకు కష్టాలు


