ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడటం వల్ల తన వ్యక్తిగత నైపుణ్యాలు తగ్గుతున్నాయేమో అనే అనుమానం కలుగుతోందని ఒక యంగ్ బ్యాక్‌ఎండ్ ఇంజనీర్ ఆందోళనల వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టెక్ ప్రొఫెషనల్ 11 నెలలుగా బ్యాక్‌ఎండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తాను రోజువారీ ఆఫీస్ పనుల్లో ఎక్కువ భాగం ఏఐ టూల్స్ సహాయంతోనే పూర్తిచేస్తున్నాడు. ముఖ్యంగా కర్సర్ ఏఐ కోడ్ ఎడిటర్ & క్లౌడ్ ఏఐ అసిస్టెంట్ వంటివి కోడ్ రాయడంలో, APIలు రూపొందించడంలో మాత్రమే కాకుండా.. ఇతర సాంకేతిక పనులను పూర్తి చేయడంలో సహాయం చేస్తున్నాయి. ఈ టూల్స్ ఇచ్చిన సూచనల ప్రకారం పనులు పూర్తి చేస్తున్నానని అతను తెలిపాడు.

ఇలాంటి సమయంలో అతనిలో ఒక సందేహం కలిగింది. సుమారు ఏడాదిగా పనిచేస్తున్నప్పటికీ.. నేను నిజంగా ఏమి నేర్చుకున్నాను. నేను ఇప్పటికే కొత్తగా ఉద్యోగంలో చేరిన వ్యక్తి మాదిరిగానే ఉన్నానని తన పోస్టులో పేర్కొన్నాడు. ఒకరోజు కర్సర్ ఏఐ సాంకేతిక సమస్య వల్ల పనిచేయకుండా పోయింది. అప్పుడు నేనే ఆ పనిని పూర్తి చేయాల్సి వచ్చింది. కానీ నేను ఏఐ సహాయం లేకుండా స్వతంత్రంగా పనిచేయలేకుండా పోతున్నానని, పని కష్టమవుతోందని వాపోయాడు.
టెక్ రంగంలోకి ప్రవేశించడం తనకు అంత సులభం కాదని కూడా సోషల్ మీడియా పోస్టులో వివరించాడు. 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. అనేక ఇంటర్వ్యూలు విఫలమైన తర్వాత 2025లో ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు ఏఐ ఉపయోగించకుండా.. చేయాల్సిన పని కష్టం అయితే.. ఉద్యోగం బహుశా పోవచ్చు కూడా.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కర్సర్ లేకుండా పని చేయడం కష్టమే అని కొందరు సీనియర్లు సరదాగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఏఐ ఉపయోగిస్తూ.. పని సులభంగా ఉందని సంబరపడిపోయే వారికి ఇదొక హెచ్చరిక అని ఇంకొందరు చెబుతున్నారు.


