గ్యాస్‌ షార్టేజీ.. ఇండక్షన్‌ స్టవ్‌లకు గిరాకీ.. | Sales of induction stoves and electric kettles are booming | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ షార్టేజీ.. ఇండక్షన్‌ స్టవ్‌లకు గిరాకీ..

Mar 12 2026 2:46 AM | Updated on Mar 12 2026 2:46 AM

Sales of induction stoves and electric kettles are booming

క్రోమాలో మూడు రెట్లు అధికం 

అమెజాన్‌లో 30 రెట్లు అప్‌ 

ఎలక్ట్రిక్‌ కెటిల్స్, ప్రెజర్‌ కుక్కర్లకు కూడా డిమాండ్‌

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలతో వంట గ్యాస్‌ సరఫరాపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్నారు. దీనితో ఇండక్షన్‌ స్టవ్‌లు, ఎలక్ట్రిక్‌ కెటిల్స్‌ అమ్మకాలు జోరందుకున్నాయి. గత కొద్ది రోజులుగా తమ దగ్గర ఇండక్షన్‌ కుక్‌టాప్‌లకు డిమాండ్‌ మూడు రెట్లు పెరిగినట్లు టాటా గ్రూప్‌లో భాగమైన క్రోమా తెలిపింది. ‘కొద్ది రోజులుగా ఇండక్షన్‌ కుక్‌టాప్‌లకు డిమాండ్‌ భారీగా ఎగిసింది. రోజువారీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. పైగా ముందు జాగ్రత్త చర్యగా కొందరు కస్టమర్లు ఒకేసారి పలు యూనిట్లను కొనే ధోరణి కూడా కనిపిస్తోంది. 

గతంలో ఇలాంటిది చూడలేదు‘ అని ఇన్ఫినిటీ రిటైల్‌ (క్రోమా) సీఈవో, ఎండీ శిబాశీష్‌ రాయ్‌ తెలిపారు. ఇండక్షన్‌ కుక్‌టాప్‌లతో పాటు ఎలక్ట్రిక్‌ కెటిల్స్‌ అమ్మకాలు కూడా సాధారణ రోజులతో పోలిస్తే రెట్టింపైనట్లు రాయ్‌ వివరించారు. వీటిని విశ్వసనీయమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయ సాధనాలుగా కస్టమర్లు పరిగణిస్తుండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. దీనితో ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ కుకింగ్‌ సాధనాలకు డిమాండ్‌ నెలకొందని, అందుకు  అనుగుణంగా తమ ఆఫ్‌లైన్‌ స్టోర్స్, ఆన్‌లైన్‌ మాధ్యమాల్లో తగినంత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూస్తున్నట్లు పేర్కొన్నారు.  

మరోవైపు, ఈ–కామర్స్‌ పోర్టల్‌ అమెజాన్‌లో కూడా ఇదే ధోరణి నెలకొంది. ‘గత రెండు రోజులుగా ఇండక్షన్‌ కుక్‌టాప్‌ల అమ్మకాలు 30 రెట్లు పెరగ్గా, రైస్‌ కుక్కర్లు, ఎలక్ట్రిక్‌ ప్రెజర్‌ కుక్కర్ల సేల్స్‌ 4 రెట్లు పెరిగాయి. ఎయిర్‌ఫ్రయర్స్, మల్టీ–యూజ్‌ కెటిల్స్‌ రెండు రెట్లు అధికంగా అమ్ముడవుతున్నాయి. నిమిషాల్లోనే డెలివరీలు పొందేలా ఢిల్లీ, ముంబై, బెంగళూరులోని కస్టమర్లు మా అమెజాన్‌ నౌ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు’ అని అమెజాన్‌ ఇండియా ప్రతినిధి తెలిపారు.  

స్టవ్‌క్రాఫ్ట్‌ జోరు.. 
పిజియన్, గిల్మా బ్రాండ్స్‌ కింద గృహోపకరణాలు విక్రయించే స్టవ్‌క్రాఫ్ట్‌ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి తమ ఆన్‌లైన్‌ విక్రయాలు వారంవారీగా చూస్తే సగటున నాలుగు రెట్లు ఎగిసినట్లు సంస్థ ఎండీ రాజేంద్ర గాంధీ తెలిపారు. విశ్వసనీయమైన, చౌక గృహోపకరణాల కోసం వినియోగదారులు అన్వేషిస్తున్న నేపథ్యంలో ఇంధనాన్ని ఆదా చేసే, ప్రత్యామ్నాయ సాధనాల వైపు మళ్లే ధోరణి ఇకపైనా కొనసాగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.  

అటు, వంటగ్యాస్‌ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెట్రోలియం, సహజ వాయువు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ తెలిపారు. డెలివరీ వ్యవధి సాధారణ స్థాయిలో రెండున్నర రోజులుగానే కొనసాగుతోందని వివరించారు.  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఎల్‌పీజీ ఉత్పత్తి 25 శాతం పెరిగిందని తెలిపారు. కానీ పశ్చిమాసియా పరిణామాలతో ఇంధన సరఫరాకు అవరోధాలు ఎదురువుతున్నందున, పారిశ్రామిక, వాణిజ్య కస్టమర్లకు ఎల్‌పీజీ ‘పరిమిత’ స్థాయిలోనే సరఫరా అవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement