ఏడాది కాలానికి ఒప్పందం
2.2 మిలియన్ టన్నులకు సై
తొలిసారి యూఎస్ నుంచి కొనుగోలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజాలు ఏడాదిపాటు యూఎస్ నుంచి వంట గ్యాస్(ఎల్‌పీజీ) కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకున్నాయి. డీల్‌లో భాగంగా 2026వరకూ 2.2 మిలియన్ టన్నుల ఎల్‌పీజీని దిగుమతి చేసుకోనున్నాయి. దీంతో యూఎస్ నుంచి భారత ప్రభుత్వం ఇంధన కొనుగోళ్లను పెంచుకోనుంది. తద్వారా యూఎస్‌తో వాణిజ్య మిగులును తగ్గించుకోనుంది.
దేశీ వస్తువులపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 50% టారిఫ్‌లను విధించిన నేపథ్యంలో తాజా డీల్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. దేశీ పీఎస్‌యూ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్.. యూఎస్ గల్ఫ్ కోస్ట్ నుంచి ఎల్‌పీజీ దిగుమతికి ఏడాదిపాటు అమల్లో ఉండే కాంట్రాక్టుకు తెరతీసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. భారత వార్షిక ఎల్‌పీజీ దిగు మతుల్లో ఇది 10% కాగా, దేశీ మార్కెట్లకు యూఎస్ ఎల్‌పీజీ సరఫరాపై తొలి కాంట్రాక్టుగా నిలవనుంది.
31 మిలియన్ టన్నులు
పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధనం విషయంలో భారత్ స్వయం సమృద్ధిని సాధించినప్పటికీ.. దేశీయంగా వినియోగించే 31 మిలియన్ టన్నుల ఎల్‌పీజీలో 65 శాతంవరకూ దిగుమతి చేసుకుంటోంది. 2024లో దిగుమతి చేసుకున్న 20.4 మిలియన్ టన్నులలో 90 శాతంవరకూ యూఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా నుంచి లభించింది. గత రెండు నెలలుగా యూఎస్‌తో భారత్ నిర్వహిస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య చర్చలలో భాగంగా వంట గ్యాస్ దిగుమతులకు తెరతీసింది. మరోపక్క పెట్రోల్, డీజిల్ తదితరాలను ప్రాసెస్ చేసేందుకు వీలయ్యే ముడిచమురులో 8 శాతంవరకూ యూఎస్ నుంచి కొనుగోలు చేస్తోంది.
51 శాతం అధికం
ఈ ఏడాది(2025) తొలి అర్ధభాగంలో యూఎస్ నుంచి రోజుకి 2,71,000 బ్యారళ్ల(బీపీడీ) ముడిచమురు ను భారత్ దిగుమతి చేసుకుంది. 2024 తొలి ఆరు నెలల దిగుమతులతో పోలిస్తే ఇవి 51 శాతం అధికం.
చారిత్రాత్మకం
ప్రపంచంలోనే వేగవంత వృద్ధిలో ఉన్న, భారీ ఎల్‌పీజీ మార్కెట్ అయిన భారత్ తొలిసారి యూఎస్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు చమురు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇది చారిత్రాత్మకంకాగా.. తద్వారా దేశ ప్రజలకు అందుబాటు ధరలో ఎల్‌పీజీ సరఫరాలకు తెరతీసినట్లు చెప్పారు.


