ఏఐ,క్లౌడ్‌పై ఆధిపత్యం కోసం ఐటీ దిగ్గజాల పోటీ
కొత్త టెక్నాలజీ కంపెనీలే టార్గెట్‌గా షాపింగ్
రూ. 38,700 కోట్ల పెట్టుబడులు
సాధారణంగా సాఫ్ట్‌వేర్ సర్వీసుల రంగ దిగ్గజాలు కార్యకలాపాల ద్వారా భారీగా నగదు ఆర్జిస్తుంటాయి. దీంతో వాటాదారులకు అత్యధికస్థాయిలో డివిడెండ్లు చెల్లిస్తుంటాయి. వీటితోపాటు కొన్ని సందర్భాలలో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు సైతం తెరతీస్తుంటాయి.
నికర లాభాలను వాటాదారులకు పంచే కంపెనీ విధానాలే దీనికికారణంకాగా.. నగదు నిల్వలను ఇతర కంపెనీల కొనుగోళ్లకూ వెచ్చిస్తుంటాయి. అయితే ఈ ఏడాది(2025–26) కొనుగోళ్లు, విలీనాల(ఎంఅండ్‌ఏ)కు ప్రాధాన్యత పెరిగింది.
దీంతో టాప్–10 టెక్ దిగ్గజాలు ఉమ్మడిగా 4.3 బిలియన్ డాలర్లు(రూ. 38,700 కోట్లు) వెచ్చించాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), క్లౌడ్ టెక్నాలజీలలో అధిక కొనుగోళ్లకు ఈ ఏడాది తెరలేచింది. గతేడాది(2024–25) డివిడెండ్లకు టాప్–10 ఐటీ కంపెనీలు 10.8 బిలియన్ డాలర్లు(రూ. 96,557 కోట్లు) కేటాయించగా.. ఈక్విటీ బైబ్యాక్‌లకు 1.5 బిలియన్ డాలర్లు(రూ. 14,000 కోట్లు) వెచ్చించాయి. ఇక ఇతర సంస్థల కొనుగోళ్లకు రూ. 27,000 కోట్లు వినియోగించాయి.
కారణాలున్నాయ్
ఈ ఏడాది కొత్త టెక్నాలజీలు, కంపెనీలపై ఐటీ దిగ్గజాలు బాగా దృష్టి పెట్టాయి. ఇందుకు ఐటీ రంగంలో ఆదాయ సంబంధ మందగమనంతోపాటు.. ఐటీ సేవలకు అతిపెద్ద మార్కెట్ యూఎస్ నుంచి హెచ్1బీ తదితర అనుకోని సవాళ్లు ఎదురుకావడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఆదాయ వనరులను పెంచుకునేందుకు సరికొత్త టెక్నాలజీల అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు తెరతీస్తున్న ఇతర కంపెనీల కొనుగోళ్లు తదితరాలపై అధిక పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు తెలియజేశాయి. ప్రస్తుతం అన్ని రంగాలలోనూ ఏఐ, క్లౌడ్ వినియోగం పెరుగుతుండటంతో విభిన్న వరి్టకల్స్, డొమైన్లలో వేగంగా విస్తరిస్తున్న కంపెనీలపై ఐటీ దిగ్గజాలు కన్నేస్తున్నట్లు పేర్కొన్నాయి.
ప్రస్తుతం ఇదీ తీరు
ఆదాయం, ఆర్డర్‌బుక్‌ను పటిష్టపరచుకునే బాటలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇతర కంపెనీలకు సొంతం చేసుకుంటున్నాయి. లిస్టయిన 2004 తదుపరి టీసీఎస్ డజను కంపెనీలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ బాటలో తాజాగా మిడ్‌క్యాప్ ఐటీ కంపెనీలు కోఫోర్జ్, హెక్సావేర్ టెక్నాలజీస్ మరో అడుగు ముందుకేశాయి. వెరసి నగదు ఆర్జనలో అధిక శాతాన్ని వాటాదారులకు పంచడంకంటే ఇతర కంపెనీల కొనుగోళ్లకే కేటాయిస్తున్నాయి. డివిడెండ్లు, ఈక్విటీ బైబ్యాక్‌లను మించుతూ కొత్త టెక్నాలజీ కంపెనీలపట్ల ఆసక్తి చూపుతున్నాయి.
కొనుగోళ్ల జోరు
దేశీ ఐటీ కంపెనీల చరిత్రలోనే భారీ డీల్‌కు తెరతీస్తూ గత వారం మిడ్‌టైర్ కంపెనీ కోఫోర్జ్ 2.39 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోలుని ప్రకటించింది. యూఎస్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఎన్‌కోరాను సొంతం చేసుకునేందుకు షేర్ల జారీ ద్వారా డీల్ కుదుర్చుకుంది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ కోఫోర్జ్ ఇతర కంపెనీల కొనుగోళ్లపై రూ. 21,450 కోట్లు వెచ్చించింది. ఇదే కాలంలో వాటాదారులకు కేవలం రూ. 260 కోట్లు డివిడెండ్‌గా చెల్లించింది.
మరో మధ్యస్థాయి ఐటీ కంపెనీ హెక్సావేర్(జనవరి–డిసెంబర్ ఆర్థిక సంవత్సరం) సైతం ఇతర సంస్థలను సొంతం చేసుకునేందుకు రూ. 1,614 కోట్లు వెచ్చించింది. సెపె్టంబర్ చివరివరకూ వాటాదారులకు డివిడెండ్ రూపేణా రూ. 349 కోట్లు కేటాయించింది. ఇక దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో ఉమ్మడిగా 7 కంపెనీల కొనుగోళ్లకు 1.03 బిలియన్ డాలర్లు వినియోగించాయి. వీటిలో డేటా అనలిటిక్స్, డిజైన్ ఇంజినీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రస్తావించదగ్గ అంశం!
– సాక్షి, బిజినెస్ డెస్క్


