ఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ వినియోగదారులకు ఊరట కల్పిస్తూ.. ఇకపై కార్లు, జీప్‌లు, వ్యాన్‌లకు కొత్తగా జారీ చేసే ఫాస్టాగ్‌లకు నో యువర్ వెహికల్ ప్రక్రియ అవసరం లేదని తెలిపింది. ఈ నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కేవైవీ ప్రక్రియ కారణంగా ఫాస్టాగ్ యాక్టివేషన్‌లో ఆలస్యం జరుగుతోందని ఎన్‌హెచ్‌ఏ గుర్తించింది. అందుకే ఈ నిబంధనను తొలగించింది. ఇప్పటికే జారీ చేసిన ఫాస్టాగ్‌లకు కూడా కేవైవీ అవసరం లేదని స్పష్టంచేసింది.
ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కేవైవీ
ఫాస్టాగ్‌ను సరిగా అతికించకపోవడం, తప్పుగా జారీ కావడం లేదా దుర్వినియోగం జరిగే సందర్భాల్లో మాత్రమే కేవైవీ తప్పనిసరి అవుతుంది. సాధారణ వినియోగదారులకు ఇకపై ఈ ప్రక్రియ అవసరం ఉండదు.
బ్యాంకుల బాధ్యత
ఫాస్టాగ్ ఇష్యూ చేసే సమయంలోనే బ్యాంకులు వాహన్ డేటాబేస్ ద్వారా వాహన వివరాలను వెరిఫై చేసి యాక్టివేట్ చేస్తాయి. వాహన్ డేటాబేస్‌లో వివరాలు లభించని సందర్భాల్లో ఆర్‌సీ ఆధారంగా వెరిఫికేషన్ చేయాలి. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఫాస్టాగ్‌లకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది.
ఇప్పటి వరకు కేవైవీ ప్రక్రియలో వాహనదారులు వాహనం ముందు, సైడ్ వ్యూ ఫొటోలు, ఆర్‌సీ, విండ్‌షీల్డ్‌పై అతికించిన ఫాస్టాగ్ స్టిక్కర్ ఫొటోలు అప్‌లోడ్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బంది తొలగనుంది. ఫాస్టాగ్ యాక్టివేషన్ మరింత వేగంగా, సులభంగా జరుగుతుంది. ఈ నిర్ణయం ద్వారా ఫాస్టాగ్ వ్యవస్థను పౌరులకు అనుకూలంగా, పారదర్శకంగా, సాంకేతిక ఆధారితంగా మార్చడమే ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యం. వినియోగదారులపై భారం తగ్గి, ఫిర్యాదులు కూడా తగ్గుతాయని సంస్థ ఆశిస్తోంది.


