ఫాస్ట్‌ట్యాగ్ విధానంలో.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒక కీలకమైన సంస్కరణను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే FASTag యాక్టివేషన్ సమయంలో వాహన వివరాలను ధృవీకరించే పూర్తి బాధ్యతను బ్యాంకులకే అప్పగించింది.
ఇంతకు ముందు.. వాహన యజమానులు అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలు సమర్పించి ఫాస్ట్‌ట్యాగ్ పొందిన తరువాత కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉండేది. దీని వల్ల యాక్టివేషన్ ఆలస్యం కావడం, టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదురవడం, రిఫండ్స్ నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి.
కొత్త విధానంతో.. ఫాస్ట్‌ట్యాగ్ జారీ తరువాత ప్రత్యేకంగా కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంకులే మొదటిసారి వాహన పత్రాలను సరిగా పరిశీలించి ధృవీకరిస్తాయి. ఫలితంగా FASTag జారీ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇది లక్షలాది మంది వాహన వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుంది.
కేవైసీ సడలింపు కేవలం కొత్తగా జారీ అయ్యే ఫాస్ట్‌ట్యాగ్‌లకు మాత్రమే కాకుండా.. ఇప్పటికే జారీ చేసినవాటికి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇకపై కేవైసీ తప్పనిసరి కాదు. అయితే.. ఫాస్ట్‌ట్యాగ్ వినియోగానికి సంబంధించిన మోసాలు జరిగినట్లు అనుమానం తలెత్తితే, కేవైసీ చేసుకోవాల్సిన ఉంటుంది.


