దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులు ఏప్రిల్ 2026 నుంచి తమ క్రెడిట్ కార్డు నియమాలలో మార్పులు అమలు చేయనున్నాయి. ముఖ్యంగా క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు, రివార్డ్ పాయింట్ల రిడంప్షన్ విధానం, అలాగే కొన్ని చెల్లింపులపై లావాదేవీ ఛార్జీల్లో మార్పులు ఉండనున్నాయి.
ఈ మార్పులను ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), యెస్ బ్యాంక్ (YES Bank), ఎస్‌బీఐ (SBI Card) తమ వినియోగదారులకు తెలియజేశాయి. కాబట్టి క్రెడిట్ కార్డు వినియోగదారులు కొత్త నిబంధనలను ముందుగానే తెలుసుకుని తమ ఖర్చు విధానాన్ని సర్దుబాటు చేసుకోవడం మంచిది.
యాక్సిస్ క్రెడిట్ కార్డు బెనిఫిట్స్‌లో మార్పులు
ఏప్రిల్ 12 నుంచి ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు రివార్డ్ స్ట్రక్చర్‌లో కొన్ని మార్పులు అమల్లోకి రానున్నాయి. వాటిలో ముఖ్యమైనవి..
ఎయిర్‌టెల్ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ చెల్లింపులపై 25% క్యాష్‌బ్యాక్ కొనసాగుతుంది.
ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా యుటిలిటీ బిల్లులు చెల్లిస్తే 10% క్యాష్‌బ్యాక్ అందుతుంది.
అయితే ప్రతి బిల్లింగ్ సైకిల్‌కు గరిష్ట క్యాష్‌బ్యాక్ పరిమితి ఇప్పుడు బేస్ క్యాష్‌బ్యాక్ క్యాప్‌తో అనుసంధానం అవుతుంది.
స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఇప్పటివరకు ఉన్న 10% క్యాష్‌బ్యాక్ నిలిపివేయనున్నారు.
బదులుగా జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై 10% వాల్యూ-బ్యాక్ అందించనున్నారు.
యెస్ బ్యాంక్ కొత్త ఛార్జీలు
ఏప్రిల్ 1 నుంచి యెస్ బ్యాంక్ యుటిలిటీ బిల్లులు, ట్రాన్స్‌పోర్ట్ చెల్లింపులపై కొత్త పరిమితులు, ఛార్జీలు అమలు చేయనుంది. కొత్త నిబంధనలు ఇలా..
విద్యుత్, నీరు, గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులపై నెలవారీ ఖర్చు నిర్దిష్ట పరిమితిని దాటితే 1% ఛార్జీ వసూలు చేస్తారు.
కార్డు రకాన్ని బట్టి పరిమితులు ఉంటాయి. యెస్ ప్రైవేట్ క్రెడిట్ కార్డు అయితే నెలకు రూ.1,00,000 వరకు, ప్రీమియం కార్డులైతే రూ.50,000 వరకు, ఇతర కార్డులకు రూ.25,000 వరకు పరిమితులను నిర్ణయించారు.
ఈ పరిమితులను దాటిన తర్వాత చేసిన యుటిలిటీ చెల్లింపులపై 1% ఫీజు వర్తిస్తుంది.
అదే విధంగా టోల్, బ్రిడ్జ్ చెల్లింపులు కూడా నిర్దిష్ట పరిమితిని మించితే 1% ఛార్జీ వసూలు చేస్తారు. అయితే ఒక్క లావాదేవీకి గరిష్ట ఛార్జీ రూ.5,000 వరకు మాత్రమే ఉంటుంది.
ఎస్‌బీఐ.. రివార్డ్ పాయింట్ రిడంప్షన్ మార్పులు
ఎస్‌బీఐ కార్డ్ కూడా ఏప్రిల్ 1 నుంచి రివార్డ్ పాయింట్ రిడంప్షన్ విధానంలో కొత్త నియమాలను అమలు చేయనుంది. కొత్త పాలసీ ప్రకారం..
స్టేట్‌మెంట్ క్రెడిట్‌గా నెలకు గరిష్టంగా 60,000 రివార్డ్ పాయింట్లు మాత్రమే రిడీమ్ చేసుకోవచ్చు.
రివార్డ్ పాయింట్ల రిడంప్షన్ 4,000 పాయింట్ల గుణిజాల్లో మాత్రమే ఉంటుంది.
అయితే ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ సిగ్నేచర్ కార్డ్ వంటి కొన్ని కార్డులకు ఈ నియమాల నుంచి మినహాయింపు ఉంటుంది.


