న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయుల వంటింట్లో సెగలు రేపుతున్నాయి. ఒకవైపు గ్యాస్ కొరత, మరోవైపు బ్లాక్ మార్కెట్ దందా సామాన్యుడి నడ్డి విరుస్తుండటంతో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని గృహ వినియోగదారులందరికీ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ (ఈ-కేవైసీ) తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, తమ మొబైల్ నుండే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ) యాప్‌తో పాటు, ‘ఆధార్ ఫేస్ ఆర్డీ) (Aadhaar FaceRD) యాప్‌ను ఉపయోగించి ఇంట్లోనే ఈ-కేవైసీ వెరిఫికేషన్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏవైనా సందేహాలుంటే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించాలని లేదా టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని సూచించింది.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపధ్యంలోనే కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ఓడల రాకపోకలు నిలిచిపోయాయి. భారత్ తన గ్యాస్ అవసరాల కోసం 90% దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది. ఫలితంగా ఢిల్లీలో 14.2 కిలోల గృహ సిలిండర్ ధర ₹60 పెరిగి ₹913కు చేరగా, కమర్షియల్ సిలిండర్ ధర ₹1,884.50కు పెరిగింది.
గ్యాస్ కొరతను సాకుగా చూపి అక్రమంగా నిల్వ చేసే వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కర్ణాటకలోని కెంఘేరిలో బ్లాక్ మార్కెట్‌కు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఢిల్లీలో గ్యాస్ డిపోల వద్ద నిరంతరం పోలీసు పహారా ఏర్పాటు చేశారు. అటు ఢిల్లీ ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సరఫరాపై 20 శాతం క్యాపింగ్ విధించి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు గ్యాస్ సరఫరా ఇబ్బందులు, మరోవైపు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు సతమతమవుతున్నాడు.
ఇది కూడా చదవండి: UAE:19 మంది భారతీయుల అరెస్ట్.. కారణం ఇదే..


