పొగాకు మీద పన్నుల మోత | Tobacco products and pan masala will attract additional central excise duty | Sakshi
Sakshi News home page

పొగాకు మీద పన్నుల మోత

Jan 2 2026 12:51 AM | Updated on Jan 2 2026 12:51 AM

Tobacco products and pan masala will attract additional central excise duty

హెల్త్‌ సెస్సుతో ప్రభుత్వ కొరడా 

ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ 

గుట్కా, పాన్‌ మసాలాపై సెస్సు 

ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ, గుట్కా, పాన్‌ మసాలాపై హెల్త్‌ సెస్సు .. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. ఈ ఉత్పత్తులపై 40 శాతం జీఎస్‌టీ రేటుకి అదనంగా జాతీయ భద్రత సెస్సు, హెల్త్‌ సెస్సు, ఎక్సైజ్‌ డ్యూటీ ఉండనున్నాయి. బీడీలపై 18 శాతం జీఎస్‌టీకి అదనంగా ఇవి ఉంటాయి. 

గుట్కాపై అదనంగా 91 శాతం, నమిలే పొగాకుపై 82 శాతం, జర్దా సెంటెడ్‌ పొగాకుపై 82 శాతం మేర అదనంగా ఎక్సైజ్‌ డ్యూటీ విధించనున్నారు. ఇక పొడవు, ఫిల్టర్‌ను బట్టి ప్రతి 1,000 సిగరెట్లకు రూ. 2,050–రూ. 8,500 వరకు సుంకాలు ఉంటాయి. ప్యాకేజీపై ముద్రించిన రిటైల్‌ ధర ప్రాతిపదికన జీఎస్‌టీ విలువను మదింపు చేసే విధంగా కొత్త ఎంఆర్‌పీ ఆధారిత వేల్యుయేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారా వచ్చే నిధులను ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు.    
     
నోటిఫికేషన్‌ ప్రకారం పొగాకు, గుట్కా తదితర ఉత్పత్తుల తయారీ సంస్థలు తమ దగ్గరున్న ప్యాకింగ్‌ మెషీన్ల సంఖ్య, వాటి సామర్థ్యాల గురించి ఎక్సైజ్‌ అధికారులకు తెలియజేయాలి. ప్యాకింగ్‌ మెషీన్లన్నీ కనిపించేలా సీసీటీవీ సిస్టమ్‌లను ఇన్‌స్టాల్‌ చేయాలి. అలాగే ఫుటేజీని కనీసం 24 నెలల పాటు భద్రపర్చాలి.  ప్రస్తుతం పాన్‌ మసాలా, సిగరెట్లు, సిగార్లు, హుక్కా, జర్దా మొదలైన పొగాకు ఉత్పత్తులపై 28 శాతం జీఎస్‌టీతో పాటు వివిధ స్థాయిల్లో కాంపెన్సేషన్‌ సెస్సు విధిస్తున్నారు. 

2017 జూలై 1న జీఎస్‌టీని ప్రవేశపెట్టినప్పుడు, రాష్ట్రాలకు వాటిల్లే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు 2022 జూన్‌ 30 వరకు అయిదేళ్ల పాటు కాంపెన్సేషన్‌ సెస్సు విధానాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. తర్వాత దీన్ని 2026 మార్చి 31 వరకు (నాలుగేళ్లు) పొడిగించింది. కోవిడ్‌ సమయంలో రాష్ట్రాలకు పరిహారం ఇచ్చేందుకు తీసుకున్న రూ. 2.69 లక్షల  కోట్ల రుణాలను 2026 జనవరి 31 నాటికి తీర్చివేశాక కాంపెన్సేషన్‌ సెస్సు విధించడం నిల్చిపోతుంది. ఈ నేపథ్యంలో తాజా సెస్సుల ప్రతిపాదనలను డిసెంబరులో పార్లమెంటు ఆమోదించింది. 

టొబాకో షేర్లు డౌన్‌ .. 
అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ నోటిఫికేషన్‌తో టొబాకో కంపెనీల షేర్లలో గురువారం భారీగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఐటీసీ షేరు దాదాపు 10 శాతం క్షీణించి సుమారు రూ. 364కి తగ్గింది. గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా షేరు ఏకంగా 17 శాతం తగ్గి దాదాపు రూ. 2,290 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 19 శాతం క్షీణించి రూ. 2,230 స్థాయిని కూడా తాకింది. అటు వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌ 0.60 శాతం క్షీణించి రూ. 255.15  వద్ద ముగిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement