ఇందులో రాష్ట్రాలకు వాటా ఇస్తాం
లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటన
హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లుకు సభామోదం
న్యూఢిల్లీ: ప్రతిపాదిత హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లులో పాన్ మసాలా తయారీ యూనిట్లపై పన్ను విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రకటించారు. ఈ పన్ను ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకుంటామని, ఆరోగ్య పథకాల కోసం వెచ్చిస్తామని తెలిపారు. హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు–2025పై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
ప్రత్యేక ప్రయోజనాల కోసం సెస్ విధించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 270 వీలు కల్పిస్తోందని చెప్పారు. అనంతరం బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. పాన్ మసాలా, అలాంటి ఉత్పత్తులను తయారు చేసేందుకు వినియోగించే యంత్రాలు, వాటి సామర్థ్యం ఆధారంగా విధించే సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని జాతీయ భద్రత, ప్రజారోగ్యం కోసం వినియోగించుకునేందుకు ఈ బిల్లులో ఏర్పాటుంది. గతంలోనూ ఇలా సెస్‌లను వివిధ వనరులపై ప్రభుత్వాలు విధించాయన్నారు.
1974 నుంచి క్రూడాయిల్‌పై సెస్, 2001 నుంచి నేషనల్ కెలామిటీ కంటింజెంట్ డ్యూటీ, 2000 నుంచి రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ పేరుతో పన్ను వసూలు చేస్తున్న చరిత్ర ఉందన్నారు. పాన్ మసాలా చౌకగా మారడానికి, అదే సమయంలో ఆదాయాన్ని కోల్పోయేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆమె తెలిపారు. వినియోగం ఆధారంగా పాన్ మసాలాపై గరిష్టంగా 40 శాతం మేర జీఎస్టీ ఉంటుందని చెప్పారు. అయితే, జీఎస్టీ ఆదాయంపై ఈ సెస్ ఎటువంటి ప్రభావం చూపదని ఆమె స్పష్టం చేశారు.


