గురువారం రాజ్యసభలో మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదముద్ర
పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై అత్యధిక సుంకం విధించనున్న కేంద్రం
న్యూఢిల్లీ: పొగాకు, పొగాకు సంబంధ ఉత్పత్తులపై అత్యధిక సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన కేంద్ర ఎక్సైజ్ (సవరణ), బిల్లు–2025కు గురువారం పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక కోవిడ్ కాలంలో రాష్ట్రాలు కోల్పోయిన రెవెన్యూ ఆదాయాన్ని భర్తీచేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్‌టీ పరిహార సెస్ ముగిసిపోయాక ఈ కొత్త అత్యధిక ఎక్సైజ్ సుంకాలను విధిస్తారు.
అధిక ఎక్సైజ్ సుంకం కారణంగానైనా రైతులు పొగాకు సాగును వదిలేసి ఇతర పంటల వైపు మళ్లుతారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానంగా నిర్మల మాట్లాడారు. ‘‘ పొగాకు సాగును రైతులు భారీగా తగ్గించుకుని ఇతర పంటల వైపు దృష్టిసారించడమే ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్, బిహార్, కర్ణాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రైతులు ఇప్పటికే అదే బాటలో నడిచారు.
దాదాపు లక్ష ఎకరాలకుపైగా సాగు భూమిలో పొగాకు సాగును వదిలేసి ఇతర పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. జీఎస్‌టీ పరిహార సెస్ ముగిసేదాకా పొగాకు ఉత్పత్తులను అయోగ్య ఉత్పత్తుల కేటగిరీలో 40 శాతం పన్నులే వసూలుచేస్తాం’’ అని ఆమె అన్నారు. బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టరూపం దాల్చాక కేంద్ర ప్రభుత్వం సిగరెట్లు, నమిలే పొగాకు, చుట్టలు, హుక్కా, గుట్కా, ఖైనీ, జర్దా తదితర పొగాకు ఉత్పత్తులపై అధిక ఎక్సయిజ్ డ్యూటీ విధించనుంది. ముడి పొగాకుపై 60 నుంచి 70 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధిస్తారు. చుట్టలు, సిగరెట్లపై 25 శాతం లేదా ప్రతి 1,000 సిగరెట్లు/చుట్టలపై గరిష్టంగా రూ.5,000 ఎక్సైజ్ డ్యూటీ వసూలుచేస్తారు. ఆయా సిగరెట్లు, చుట్టలకు ఫిల్టర్, నాణ్యత, పొడవు ఆధారంగా ప్రతి 1,000 చుట్టలు/సిగరెట్లపై కనిష్టంగా రూ.2,700, గరిష్టంగా రూ.11,000 ఎక్సయిజ్ సుంకం విధిస్తారు. నమిలే పొగాకుపై కేజీకి రూ.100 వసూలుచేస్తారు.
నిత్యావసర వస్తువులపై ఆరోగ్య, జాతీయభద్రతా సెస్ ఉండదు నిత్యావసర వస్తువులపై కొత్తగా ప్రతిపాదించిన ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్‌ను విధించబోమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. పాన్ మసాలా వంటి అయోగ్య(డీమెరిట్) వస్తువులపై మాత్రమే కొత్త సెస్‌ను వసూలుచేస్తామని ఆమె పేర్కొన్నారు. ఇలా వచ్చిన రెవెన్యూను రాష్ట్రాల్లో ఆరోగ్య పథకాల కోసం ఖర్చుచేసేందుకు రాష్ట్రాలతో పంచుకుంటామని ఆమె చెప్పారు. గురువారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మల ఈ విషయాన్ని వెల్లడించారు.
అవగాహన కంటే ఆదాయంమీదే దృష్టిపెట్టారు
పొగాకు ఉత్పత్తుల అతి వినియోగాన్ని తగ్గించేందుకు, జనాల్లో దురలవాట్లపై దుష్ప్రభావాలపై అవగాహన పెంచడంపై దృష్టిపెట్టకుండా ప్రభుత్వం అధిక ఆదాయంపై దృష్టిసారించిందని విపక్ష పార్టీల సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బిల్లు ఆమోదం పొందడానికి ముందు బిల్లుపై జరిగిన చర్చలో పలువురు ఎంపీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.


