ఇరు దేశాల ప్రయోజనాలే మాకు ముఖ్యం
మోదీ బలమైన నాయకుడు.. ఒత్తిళ్లకు లొంగబోరు
ముడి చమురు కొనే హక్కు భారత్‌కు ఉండకూడదా?
ఇండియా టుడే ఇంటర్వ్యూలో పుతిన్
న్యూఢిల్లీ: భారత్, రష్యా దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఏ ఒక్క దేశానికీ వ్యతిరేకం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ తేల్చిచెప్పారు. జాతీయ ప్రయోజనాల కోసమే ఇరుదేశాలు కలిసికట్టుగా పని చేస్తున్నాయని, పరస్పరం సహకరించుకుంటున్నాయని వెల్లడించారు. తమ ప్రయోజనాల పరిరక్షణే రెండు దేశాల ధ్యేయమని ఉద్ఘాటించారు. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం 50 సుంకాలు విధించడాన్ని ట్రంప్ పరోక్షంగా తప్పుపట్టారు.
భారత్–రష్యా స్నేహాన్ని, అంతర్జాతీయ మార్కెట్లలో భారత్ ప్రాబల్యం పెరుగుతుండడాన్ని కొందరు జీరి్ణంచుకోలేకపోతున్నారని విమర్శించారు. రాజకీయ కారణాలతోనే భారత్‌కు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో కృత్రిమ అవరోధాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. భారత పర్యటన నేపథ్యంలో పుతిన్ ‘ఇండియా టుడే’ వార్తా చానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పశి్చమ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ భారత్‌తో తమ ఇంధన బంధం ఎలాంటి ప్రభావానికి లోను కాలేదని స్పష్టంచేశారు. ఎవరు ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెంచినా తాను గానీ, మోదీ గానీ ఇతర దేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించబోమని వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సొంత ఎజెండా, సొంత లక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. తమకు మాత్రం సొంత ప్రయోజనాలే ముఖ్యమని ఉద్ఘాటించారు. భారత ప్రధాని మోదీ బలమైన నాయకుడు అంటూ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఒత్తిళ్లకు మోదీ సులువుగా లొంగబోరని చెప్పారు. మోదీ ప్రధానమంత్రిగా ఉన్నందుకు భారతీయులు గరి్వంచాలని పేర్కొన్నారు. ఉక్రెయిన్–రష్యా ఘర్షణపైనా పుతిన్ స్పందించారు. ఈ సంక్షోభానికి అమెరికా ప్రభుత్వం ఒక శాంతియుత పరిష్కార మార్గాన్ని సూచిస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
చట్టబద్ధమైన హక్కులు కాపాడుకుంటాం..
రష్యా నుంచి భారత్ ముడి చమురు కొంటున్నందుకు అమెరికా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని పుతిన్ ఖండించారు. రష్యా నుంచి చమురు కొనే హక్కు అమెరికాకు ఉన్నప్పుడు అదే హక్కు భారత్‌కు ఉండకూడదా? అని ప్రశ్నించారు. అమెరికా తమ దేశం నుంచి అణు ఇంధనం కొంటూనే ఉందని గుర్తుచేశారు. దాంతో అమెరికా అణు విద్యుత్ ప్లాంట్లతో ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఇండియా కొంత తగ్గించుకున్నట్లు చెప్పారు. ఇది స్వల్పంగానే ఉందని పేర్కొన్నారు. భారత్‌లో చమురు, పెట్రోలియం ఉత్పత్తుల వాణిజ్యం సజావుగానే సాగుతోందని, ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టంచేశారు.


