పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు అమెరికా అధ్యక్షుడు పెద్దపీట వేస్తుండగా.. అమెరికా ఎంపీలు మాత్రం మునీర్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు 44 మంది అమెరికా ఎంపీలు సంతకాలు చేసిన లేఖను ఆ దేశ విదేశాంగ మంత్రికి పంపారు.
పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇకపై అమెరికాలోకి రాకుండా.. ఆయనపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ.. 44 మంది ఎంపీలు అమెరికా విదేశాంగ మంత్రి మార్కోరూబియోకు లేఖ రాశారు. ఇప్పుడు ఈ అంశం అమెరికాలో సంచలనంగా మారింది. ఆసిమ్ మునీర్ ఒక నేరగాడని, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పైనా చర్యలు తీసుకోవాలని అమెరికా ఎంపీలు తమ లేఖలో పేర్కొన్నారు. మునీర్‌పై తక్షణమే ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.
ఈ లేఖ రాసిన వారిలో డెమోక్రటిక్ సభ్యులు ప్రమీలా జయపాల్, గ్రేగ్ కస్సార్ వంటివారు ఉన్నారు. పాకిస్థాన్‌లో ప్రభుత్వాన్ని సైన్యం నడుపుతోందని, ఆ దేశంలో నియంతృత్వం, హింసా పెరిగాయని, జర్నలిస్టులను బెదిరిస్తున్నారని, కిడ్నాప్ చేస్తున్నారని పేర్కొంటూ.. వర్జీనియా జర్నలిస్టు నూరానీ కిడ్నాప్ ఉదంతాన్ని ప్రస్తావించారు
వర్జీనియా జర్నలిస్టు అహ్మద్ నూరానీ పాకిస్థాన్ సైన్యంలో అవినీతిపై వరుస కథనాలు రాశారు. ఆ తర్వాత నూరానీ, పాకిస్థాన్‌లో ఉంటున్న అతని ఇద్దరు సోదరులు అపహరణకు గురయ్యారు. నెలరోజులకు పైగా వారిని పాక్ సైన్యం నిర్బంధించింది. ఆ తర్వాత విడుదల చేసింది. వీరితోపాటు.. ప్రముఖ సంగీత దర్శకుడు సల్మాన్ అహ్మద్ బావమరిది కిడ్నాప్ ఉదంతాన్ని కూడా ఎంపీలు తమ లేఖలో ప్రస్తావించారు. అమెరికా జోక్యం తర్వాతే అతను విడుదలైన విషయాన్ని గుర్తుచేశారు. పాకిస్థాన్‌లో విపక్ష నాయకులపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా.. వారిని జైలులో నిర్బంధిస్తున్నారని, సోషల్ మీడియాలో గళమెత్తే సాధారణ పౌరులను హింసిస్తున్నారని, మహిళలు, మైనారిటీలు, బలూచిస్థాన్ పౌరులు హింసకు గురవుతున్నారని పేర్కొన్నారు.
ఇంకా ఆ లేఖలో ఏయే అంశాలను ప్రస్తావించారు?
2024 పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ అంశంపై దర్యాప్తు జరపాలని ఎంపీలు తమ లేఖలో డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన పటాన్ రిపోర్టు పూర్తిగా తప్పుడు సాక్ష్యాలు, అబద్ధాలతో నిండి ఉందని వివరించారు. ఈ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చింది కేవలం తోలుబొమ్మ ప్రభుత్వమేనని విమర్శించారు. సైన్యమే డీఫాక్టోగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్ సుప్రీంకోర్టు కూడా సైనిక న్యాయస్థానాలు సాధారణ పౌరులపై విచారణ జరపవచ్చని తీర్పునివ్వడం సహజ న్యాయసూత్రాలకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు.
ఈ ఒక్క తీర్పును బట్టే పాకిస్థాన్‌లో పరిపాలన సైన్యం నియంత్రణలోకి వెళ్లిందని స్పష్టమవుతున్నట్లు వివరించారు. ఇదే లేఖలో ఇమ్రాన్ ఖాన్ నిర్బంధం, అతని మృతిపై వస్తున్న వార్తలను గురించి ప్రస్తావించారు. అమెరికా చట్టాల ప్రకారం 44 మంది ఎంపీలు రాసిన లేఖను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే.. ఆరోపణలను ఎదుర్కొనేవారి వీసాపై అమెరికా నిషేధం విధించాల్సి ఉంటుంది. వారికి సంబంధించిన ఆస్తులు అమెరికాలో ఉంటే.. వాటిని జప్తు చేసే అవకాశాలుంటాయి.


