దక్షిణ సూడాన్‌లో బెడిసికొట్టిన హైజాక్ యత్నం
జుబా: అది దక్షిణ సూడాన్ రాజధాని జుబా.. ఉదయపు వేళ ఒక చిన్న విమానం మెల్లగా గాల్లోకి లేచింది. అది క్రైస్తవ సహాయక బృందానికి చెందిన చిన్న టర్బోప్రాప్ విమానం. సమారిటన్స్ పర్స్ అనే సంస్థకు చెందిన సెస్నా గ్రాండ్ కారవాన్. సుదూర ఈశాన్య ప్రాంతంలోని మైవూట్ కౌంటీకి అత్యవసర వైద్య సామగ్రిని చేరవేయడమే దాని లక్ష్యం. కానీ ఆ ప్రయాణం ఊహించని భయానక మలుపు తీసుకోబోతోందని ఎవరికీ తెలియదు.
హైజాకర్ ఎంట్రీ
టేకాఫ్ కావడానికి ముందే, విమానంలోకి యాసిర్ మహ్మద్ యూసుఫ్ అనే దుండగుడు చొరబడ్డాడు. వెనుక క్యాబిన్‌లో రహస్యంగా దాక్కున్నాడు. గగనతలంలో విమానం ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా తుపాకీతో బెదిరించి, పైలట్‌ను అదుపులోకి తీసుకున్నాడు. ఆ విమానాన్ని దక్షిణ సూడాన్‌కు సరిహద్దు లేని మధ్య ఆఫ్రికా దేశం చాడ్‌కు పోనివ్వాలని డిమాండ్ చేశాడు.
బోల్తా కొట్టించిన పైలట్
హైజాక్ తర్వాత, విమానం గంటల తరబడి గాల్లో చక్కర్లు కొట్టింది. విమానంలో ఇంధనం అయిపోయిందని, రీఫ్యూయలింగ్ తప్పనిసరి అని దుండగుడికి పైలట్ స్పష్టం చేశాడు. హైజాకర్‌ను నమ్మించి, విమానాన్ని ఉత్తర పట్టణమైన వాయు వైపు మళ్లించాడు.
హైజాకర్ అరెస్ట్
పైలట్ వ్యూహం ఫలించింది. విమానం వాయు పట్టణంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. వాయు పట్టణం ఉన్న వెస్ట్రన్ బహర్ ఎల్ గజల్ రాష్ట్ర పోలీసు ప్రతినిధి అయిన సంతినో ఉడోల్ మయెన్ తెలిపిన వివరాల ప్రకారం, విమానం ల్యాండ్ అయిన వెంటనే దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడు దక్షిణ సూడాన్, సూడాన్ మధ్య వివాదాస్పదమైన, చమురు–సంపన్న ప్రాంతమైన అబ్యేయి అడ్మినిస్ట్రేటివ్ ఏరియా నివాసి.
జుబా అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేసే ఒక ఎయిర్ చార్టర్ కంపెనీ లోగో ఉన్న రిఫ్లెక్టివ్ వెస్ట్‌ను ధరించి ఉన్నాడు. అయితే, ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పాల్ ఆంట్రోబస్, ఆ పేరుతో తమ సంస్థలో ఎవరూ పని చేయడం లేదనడం గమనార్హం. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. తమను కాపాడిన భద్రతా దళాలకు సమారిటన్స్ పర్స్ ప్రతినిధి మెలిస్సా స్ట్రిక్‌ల్యాండ్ కృతజ్ఞతలు తెలిపారు.


