ఇమ్రాన్‌ ఖాన్‌కు జైల్లో ప్రత్యక్ష నరకం! | Imran Khan Want Dosti With India While Asim Munir Wants This | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్‌ ఖాన్‌కు జైల్లో ప్రత్యక్ష నరకం!

Dec 3 2025 1:44 PM | Updated on Dec 3 2025 1:47 PM

Imran Khan Want Dosti With India While Asim Munir Wants This

పొరుగు దేశం భారత్‌తో ఇమ్రాన్‌ ఖాన్‌ ఏనాడూ కయ్యానికి కాలు దువ్వలేదని.. పైగా సంబంధాలను మెరుగుపర్చుకునేందుకే అడుగులు వేశాడని ఆయన సోదరి అలీమా ఖాన్‌ అంటున్నారు. పాక్‌ మాజీ ప్రధాని భద్రతపై పుకార్లు షికార్లు చేయడంతో.. తీవ్ర ఒత్తిళ్ల నడుమ ఆయన కుటుంబ సభ్యుల్ని ములాఖత్‌కు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఖాన్‌ సోదరి అలీమా ఖాన్‌ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ... సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసిమ్‌ మునీర్‌ పాక్‌తో యుద్ధం జరగాలని ఆశించారు. కానీ, ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రం దోస్తీ కోసం తీవ్రంగా ప్రయత్నించారని ఆమె అన్నారు. ఈ క్రమంలో మునీర్‌పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ ఇమ్రాన్‌ ఖాన్‌ స్వేచ్ఛగా ఆలోచించేవాడు. అందుకే అధికారంలోకి రాగానే భారత్‌తో, అక్కడి అధికార పార్టీ బీజేపీకి స్నేహ హస్తం అందించే ప్రయత్నం చేశాడు. కానీ, మునీర్‌ రాడికలైజ్డ్‌ ఇస్లామిస్ట్‌. అందుకే భారత్‌తో కయ్యానికి కాలు దువ్వాడు. అతని ఆ ప్రయత్నంలో భారత్‌ మిత్రదేశాలు కూడా ఇబ్బంది పడ్డాయి’’ అని అన్నారామె. ఇమ్రాన్‌ ఖాన్‌ను పాక్‌ జాతి సంపదగా అభివర్ణించిన అలీమా.. చెర నుంచి విడిపించేందుకు పాక్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని  పాశ్చాత్య దేశాలకు విజ్ఞప్తి చేశారు.

ఒంటరిగా చిన్న సెల్‌లో బంధించారు. ఎవరితో మాట్లాడనివ్వడం లేదు. బయటకు కూడా రానివ్వడం లేదు. సరైన తిండి పెట్టడం లేదు. మందులూ అందించడం లేదు. మానసికంగా ఆయన కుంగిపోయి ఉన్నారు. జైల్లో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు.  ఈ పరిస్థితికి అసిం మునీర్‌ కారణం. పాక్‌ ప్రభుత్వానికి ఇమ్రాన్‌ఖాన్‌ అంటే భయం పట్టుకుంది. ఎందుకంటే ఆయనకు పాక్‌ ప్రజల మద్దతు ఉంది కాబట్టి. ఇలాంటి చర్యల ద్వారా ఆయన్ని ప్రజలు మరిచిపోయేలా చేయాలనుకుంటున్నారు. కానీ, ఎంత అణిచివేస్తే అంత పెద్ద ఉద్యమం పుడుతుంది అని అలీమా సదరు మీడియా సంస్థతో అన్నారు.

మునీర్‌తో చెడింది అక్కడే..
2019లో ఇమ్రాన్‌ ఖాన్‌ భార్య బుష్రా బీబీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ విషయంలో ఆనాడు ఐఎస్‌ఐ డైరెకటర జనరల్‌గా ఉన్న మునీర్‌.. అతిగా ఆసక్తి చూపించారు. ఇది నచ్చని ఇమ్రాన్‌ఖాన్‌.. మునీర్‌ను పదవీ నుంచి తొలగించాడు. ఇది సాధారణంగానే ఇమ్రాన్‌ ఖాన్‌పై పగను పెంచుకునేలా చేసింది.

పలుకేసుల్లో శిక్ష పడడంతో ఇమ్రాన్‌ ఖాన్‌ 2023 ఆగస్టు నుంచి రావల్పిండి అడియా జైల్లో ఉంటున్నారు. అయితే.. నెల రోజుల నుంచి ఆయన నుంచి ఎలాంటి అప్డేట్‌ లేదు. చివరి సందేశంలో ఆయన మునీర్‌పైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు, పీటీఐ నేతలను ఆయన్ని కలిసేందుకు జైలు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో ఆయన జైల్లోనే మరణించారని.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని.. అనారోగ్యం బారిన పడ్డారని.. ఇలా రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఈలోపు..

షెహబాజ్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో.. మంగళవారం ఇమ్రాన్‌ ఖాన్‌ మరో సోదరి ఉజ్మా ఖానుమ్‌ 20 నిమిషాలపాటు ఇమ్రాన్‌ ఖాన్‌తో ములాఖత్‌ అయ్యారు. జైల్లో ఆయన మానసికంగా నరకం అనుభవిస్తున్నారని అన్నారామె. ఇది పీటీఐ వర్గాలకు తీవ్రాగ్రహం తెప్పించింది.

ఇండియా-పాక్‌ ఉద్రిక్తతలు
ఈ ఏడాది ఏప్రిల్‌ 22వ తేదీన.. జమ్ము కశ్మీర్‌ అనంతనాగ్‌ జిల్లా పహల్గాంలోని బైసరన్‌ లోయలో ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 26 మంది పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా మే 7వ తేదీన ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట దాడులు చేసింది భారత సైన్యం. పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని మెరుపు దాడులు నిర్వహించి ఉగ్రవాద శిక్షణా శిబిరాలను నేలమట్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement