వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ధ్వజమెత్తారు. ఈసారి సోమాలియా దేశం, ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. పనిలో పనిగా మిన్నెసోటా డెమొక్రటిక్ నేత ఇల్హాన్ ఒమర్‌ను ఉద్దేశిస్తూ పరుష పదజాలంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం కేబినెట్ మీటింగ్ అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో ట్రంప్ సంచలన వ్యాఖ్యలే చేశారు. ‘‘సోమాలియా వలసదారులు అమెరికాకు పెనుభారంగా మారారు. వాళ్ల సంక్షేమం కోసం ఫెడరల్ ప్రభుత్వం అనవసర ఖర్చులు చేస్తోంది. తిరిగి వాళ్ల నుంచి మన దేశానికి ఒరుగుతోంది ఏం లేదు. అలాంటి వాళ్లను మన దేశంలో ఉంచాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు.
ఆ దేశం అస్సలు మంచిది కాదు. పైగా కంపు కొడుతుంటుంది. మన దేశంలోకి అలాంటి చెత్తను అనుమతిస్తే.. దేశం తప్పు దారిలో వెళ్తుంది. ఇల్హాన్ ఒమర్ ఓ చెత్త. ఆమె స్నేహితులు కూడా చెత్తనే. వాళ్లు పని చేసే రకం కాదు. అమెరికాకు ఏ రకంగానూ ఉపయోగపడకపోగా.. ఫిర్యాదులతో బద్నాం చేస్తున్నారు. అలాంటి వాళ్లతో ఏం లాభం?.. అని అన్నారాయన.
అయితే మిన్నియాపోలిస్ మేయర్ జాకోబ్ ఫ్రే పైఆరోపణలను ఖండించారు. అభివృద్ధిలో సోమాలియ కమ్యూనిటీ కీలకంగానే వ్యవహరిస్తోందని.. సమాజానికి ట్రంప్ తప్పుడు సందేశాన్ని పంపుతున్నారని అన్నారు. మిన్నెసోటా డెమోక్రాటిక్ గవర్నర్ టిమ్ వాల్జ్ సైతం ట్రంప్ కామెంట్లను ఖండించారు. మరోవైపు.. ట్రంప్ వ్యాఖ్యలపై ఇల్హాన్ ఒమర్ స్పందించారు. ట్రంప్ నాపై పెడుతున్న ఫోకస్ దారుణంగా ఉంది. ఆయనకు తక్షణ సాయం అవసరమని భావిస్తున్నానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
వైట్‌హౌజ్ సమీపంలో తాజాగా జరిగిన ఉగ్రదాడి తర్వాత.. 19 దేశాల నుంచి అన్ని ఇమిగ్రేషన్ దరఖాస్తులను అమెరికా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమాలియాను, ఆ దేశానికి చెందిన ఇన్హాల్ ఒమర్‌ను ట్రంప్ టార్గెట్ చేశారు. మిన్నెసోటాలో సోమాలి-అమెరికన్ కమ్యూనిటీ ఎక్కువగా జీవిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వలసదారుల్ని తిరిగి పంపించేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇందుకోసం స్పెషల్ ఆపరేషన్(Minnesota operation) చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మిన్నెసోటాలో నివసించే సోమాలి కమ్యూనిటీలో సుమారు 95 శాతం మంది అమెరికా పౌరులే అని అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ కౌన్సిల్ మిన్నెసోటా శాఖ చెబుతుండడం గమనార్హం.


