తప్పితే పదేళ్లలో పక్కా
ఎలాన్ మస్క్ జోస్యం
వాషింగ్టన్: వివాదాస్పద, ముక్కుసూటి వ్యాఖ్యలకు, గమ్మత్తైన జోస్యాలకు పెట్టింది పేరైన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి నోరు విప్పారు. రానున్న ఐదు నుంచి పదేళ్లలో ప్రపంచం అతి పెద్ద యుద్ధాన్ని చవిచూడటం ఖాయమని జోస్యం చెప్పారు. అది దాదాపుగా అణుయుద్ధమే అవుతుందని కూడా అభిప్రాయపడ్డారు. ‘‘బహుశా అది అతి త్వరలో జరగనుంది. 2030 నాటికే, లేదా అంతకుముందే మొదలైనా ఆశ్చర్యం లేదు. అందుకు ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది’’అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే అది ఎలా మొదలవుతుందన్న దానిపై మాత్రం మస్క్ తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు.
అణు తటస్థత తదితరాలపై ఎక్స్‌లో జరిగిన సంభాషణలో ఒక యూజర్ ప్రశ్నకు బదులిస్తూ మస్క్ ఈ మేరకు భవిష్యవాణి వినిపించారు. అణు భయంతో భారీ యుద్ధాలకు దిగేందుకు దేశాలన్నీ భయపడుతున్నాయని సదరు యూజర్ చేసిన వ్యాఖ్యలతో మస్క్ ఏకీభవించలేదు. ‘‘యుద్ధం తప్పదు గాక తప్పదు. ఐదు, లేదంటే మహా అయితే పదేళ్లలోపే ప్రపంచం అతి పెద్ద యుద్ధాన్ని చవిచూడటం ఖాయం’’అని చెప్పుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావడంలో మస్క్ కీలక పాత్ర పోషించడం తెలిసిందే. ఆయన ఎన్నికల ప్రచారానికి ఇతోధికంగా ఆర్థిక సాయం చేయడమే గాక ఎక్స్‌ను కూడా అందుకు విరివిగా వాడుకున్నారు.
అందుకు ప్రతిగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)లో భాగంగా తెరపైకి తెచ్చిన డోజ్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ) విభాగానికి మస్‌్కను సారథిగా గత జనవరిలో ట్రంప్ నియమించారు. తర్వాత కొద్ది నెలల పాటు మస్క్ అపరిమిత అధికారాలు చెలాయించడమే గాక ప్రభుత్వానికి చెందిన అత్యంత సున్నితమైన, అతి రహస్యమైన డేటాను కూడా చేజిక్కించుకున్నారంటూ అప్పట్లో అమెరికా మీడియా కోడై కూసింది.
ఈ నేపథ్యంలో ఏదో విశ్వసనీయమైన సమాచారం ఆధారంగానే మస్క్ ఇప్పుడిలా ఉన్నట్టుండి ‘అణుయుద్ధ’జోస్యానికి దిగారని భావిస్తున్నారు. మస్క్ యాజమాన్యంలోని ఎక్స్‌ఏఐకి చెందిన ఏఐ చాట్‌బోట్ గ్రోక్‌ను ఆయన జోస్యంపై వివరణ ఇవ్వాల్సిందిగా పలువురు ఎక్స్ యూజర్లు కోరారు. ఆయన గతంలో చెప్పిన జోస్యాలన్నీ దాదాపుగా ఫలించాయిగా అంటూ అది తన బాస్‌కు బాసటగా నిలవడం విశేషం!


