బెలూచిస్తాన్ రీజియన్‌లో గత 10 రోజులుగా నెలకొన్న పరిస్థితులు పాకిస్తాన్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెబల్ గ్రూప్స్ వరుస దాడులతో పాక్ సైన్యం వణికిపోతోంది. తాజాగా బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ మునుపెన్నడూ లేని రీతిలో కొత్త తరహా దాడికి దిగింది. ఈ దాడిలో భారీగానే ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
జరీనా రఫీయా అలియాస్ ట్రాంగ్ మహూ.. బెలూచ్ వేర్పాటువాద సంస్థల దృష్టిలో ఆమె వీర మహిళ. చగయ్ సమీపంలో చైనా మైనింగ్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఆదివారం సాయంత్రం ఓ బాంబుతో ఆత్మాహుతి దాడి జరిపింది. ఈ దాడిలో చైనాకు ఆస్తినష్టం జరపడంతో పాటు ఆరుగురు పాక్ సైనికుల మరణించారు. అందుకే.. ఆమె త్యాగాన్ని అంతగా కీర్తిస్తున్నారు.
బీఎల్‌ఎఫ్ ఈ తరహా మానవ బాంబు దాడులకు(fidayeen strike) దిగడం ఇదే తొలిసారి. అందునా ఒక మహిళతో దాడి చేయించడంతో ప్రముఖంగా నిలిచింది. ఈ మేరకు మహూ ఫొటోను టెలిగ్రామ్ ద్వారా రిలీజ్ చేసింది.
చగయ్ జిల్లాలో చైనా అతిపెద్ద రాగి, బంగారపు మైన్ కార్యాకలాపాల సంబంధిత కార్యాలయాన్ని నెలకొల్పింది. ఇందుకోసం అక్కడ పాక్ భారీగా సైన్యాన్ని మోహరించింది. మహూ తొలుత ఆత్మాహుతి దాడి జరిపి కాపలాగా ఉన్నవాళ్లను హతమార్చింది. ఆపై రెబల్స్‌లోకి ప్రవేశించి తమ దాడిని సులువుగా కొనసాగించారు. అయితే ఈ దాడిలో తమ సైనికులు మరణించిన విషయాన్ని పాక్ సైన్యం ధృవీకరించలేదు.
మరో వైపు.. ఈ మధ్యకాలంలో జరిగిన వరుస దాడులు తమ పనేనని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) ప్రకటించుకుంది. ఈ దాడుల్లో పాక్ ఇంటెలిజెన్స్.. ఆర్మీ అధికారులు పలువురు మరణించారు.
ఎందుకీ దాడులంటే..
బెలూచిస్తాన్‌లో తిరుగుబాట్లు (Baloch Insurgency) దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా జాతి స్వతంత్రత, వనరుల దోపిడీ, రాజకీయ నిర్లక్ష్యం, మానవ హక్కుల ఉల్లంఘనలు వంటి కారణాలతో ఇవి మొదలయ్యాయి. నెమ్మదిగా.. చైనా పెట్టుబడులు (CPEC ప్రాజెక్టులు), పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడుల రూపంలో మరింత తీవ్రమవుతున్నాయి. BLA (Baloch Liberation Army), BLF (Baloch Liberation Front) వంటి గ్రూపులు చైనా ప్రాజెక్టులు, పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇందుకోసం చైనా ప్రాజెక్టులపై దాడులు, తాత్కాలిక భూభాగం ఆక్రమణలు.. ఇప్పుడు ఏకంగా సూసైడ్ దాడుల్లాంటి వ్యూహాలు అవలంబిస్తున్నాయి.
ప్రధాన కారణాలు ఏంటంటే..
బలూచిస్తాన్‌లో గ్యాస్, ఖనిజాలు, పోర్టులు ఉన్నప్పటికీ స్థానికులకు లాభం తక్కువ(ఆర్థిక దోపిడీ). వీటికి తోడు.. స్థానిక నాయకులకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం(రాజకీయ ప్రాధాన్యత లేకపోవడం). పాకిస్తాన్ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దాడులు, అపహరణలు, జాతి స్వతంత్రత(మానవ హక్కుల ఉల్లంఘనలు).. బలూచ్ జాతి వేర్పాటువాద పోరాటం.. చైనా పెట్టుబడులు (CPEC) పెడుతుండడాన్ని అక్కడి వాళ్లు భరించలేకపోతున్నారు. అందుకే తిరుగుబాటు గ్రూపుల ప్రధాన లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు మారాయి. ఇది సాధారణంగానే పాక్ సైన్యంతో పాటు చైనాకు గుబులు పుట్టిస్తోంది.
బలూచిస్తాన్ తిరుగుబాట్ల చరిత్ర👇
మొదటి తిరుగుబాటు (1948): ఖాన్ ఆఫ్ కలాత్ పాకిస్తాన్‌లో విలీనాన్ని వ్యతిరేకించడంతో ప్రారంభమైంది.
రెండో దశ తిరుగుబాటు (1958–59): భూస్వామ్యం, స్వతంత్రత డిమాండ్లతో మళ్లీ అల్లర్లు.
మూడో దశ తిరుగుబాటు (1962–63): గిరిజన నాయకులు, పాకిస్తాన్ సైన్యం మధ్య ఘర్షణలు..
నాలుగో దశ తిరుగుబాటు (1973–77): పెద్ద ఎత్తున సైనిక చర్యలు, వేలాది మరణాలు..
ఐదో దశ తిరుగుబాటు (2004–ప్రస్తుతం): అత్యంత దీర్ఘకాలంగా.. ప్రస్తుతం కొనసాగుతున్నాయి.


