బాబర్‌ ఆజమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు | Babar Azam Named Captain In Pakistan After T20 World Cup | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ వైఫల్యాల తర్వాత కూడా బాబర్‌ ఆజమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు

Mar 3 2026 12:38 PM | Updated on Mar 3 2026 12:57 PM

Babar Azam Named Captain In Pakistan After T20 World Cup

టీ20 ప్రపంచకప్‌ 2026లో వరుస వైఫల్యాల తర్వాత కూడా పాకిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం.. బాబర్ ఆజమ్ నేషనల్ టీ20 కప్ 2026లో లాహోర్ రీజియన్ వైట్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 5న రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో లాహోర్ వైట్స్, పెషావర్ రీజియన్‌ను ఎదుర్కొంటుంది.  

గత ఎడిషన్‌లో లాహోర్ వైట్స్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరినా, అబ్బొటాబాద్ రీజియన్ చేతిలో ఓటమిపాలైంది. ఈసారి బాబర్ నాయకత్వంలో లాహోర్‌ వైట్స్‌ మెరుగైన ఫలితాలు సాధించాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.  

ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌ 2026 ఎడిషన్‌లో పాక్‌ ఓ మోస్తరు ప్రదర్శనలు చేసినా సూపర్‌-8 దశలోనే నిష్క్రమించింది. చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించినా, న్యూజిలాండ్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ లేని కారణంగా సెమీస్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆరంభ మ్యాచ్‌లలో దారుణంగా విఫలమైనందుకు బాబార్‌ ఆజమ్‌ను శ్రీలంక మ్యాచ్‌ నుంచి తప్పించారు.

ఈ ప్రపంచకప్‌లో బాబర్‌ 4 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 22.75 కాగా, స్ట్రైక్ రేట్ 112.34గా ఉంది. ఈ చెత్త ప్రదర్శనలతో బాబర్‌ పాకిస్తాన్ జట్టుకు భారంగా మారాడు. గత కొన్ని సంవత్సరాలుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఇదే తీరు కొనసాగుతుంది.

2023 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత బాబర్‌ 23 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 772 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ  శతకం, ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత అతను 20 ఇన్నింగ్స్‌ల్లో 451 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 26.52, స్ట్రైక్ రేట్ 118.99గా ఉంది. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి.

టీ20 ప్రపంచకప్‌లో ఘోర ప్రదర్శనల తర్వాత జాతీయ జట్టులో స్థానమే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో బాబర్‌కు దేశవాలీ జట్టు పగ్గాలు దక్కడం ఆశ్చర్యంగా ఉంది. త్వరలో బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు బాబర్‌తో పాటు సీనియర్లను తప్పించే అవకాశం ఉందని తెలుస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement