టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరింది. నాలుగు సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.
కాగా, ఇంగ్లండ్‌తో సెమీస్‌కు ముందు టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడుతుంది. భారత ఫీల్డింగ్ ప్రతి భారత క్రికెట్ అభిమానిని ఆందోళనకు గురి చేస్తోంది. విండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా 3 మ్యాచ్‌లు నేలపాలు చేశారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ కీలక దశలో రెండు క్యాచ్‌లు జారవిడిచాడు. ఓ క్యాచ్‌ను తిలక్ వర్మ వదిలేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ప్రతికూల ఫలితం వచ్చుంటే, అభిషేక్, తిలక్‌పై ముప్పేట దాడి జరిగుండేది. టీమిండియా గెలవడంతో ఈ ఇద్దరు భారీ ట్రోలింగ్‌ను తప్పించుకున్నారు.
విండీస్‌తో మ్యాచ్ ఒక్కటే కాదు, మెగా టోర్నీ ప్రారంభం నుంచి టీమిండియా ఫీల్డింగ్ అత్యంత చెత్తగా ఉంది. సూపర్-8కి చేరిన జట్లలో అత్యంత చెత్త క్యాచింగ్ ప్రదర్శనలు మనవే. భారత ఫీల్డర్లు 100లో కేవలం 71 శాతం క్యాచ్‌లను మాత్రమే పట్టారు. మొత్తంగా సూపర్-8కు చేరిన జట్లలో ఏ జట్టు వదలని విధంగా ఏకంగా 13 క్యాచ్‌లు నేలపాలు చేశాడు. అదనంగా భారత ఫీల్డర్లు మిస్ ఫీల్డింగ్ కూడా చేసి ప్రత్యర్దిని అదనపు పరుగులు సమకూర్చారు.
సెమీస్‌లో ఇదే పరిస్థితి కొనసాగితే టీమిండియా తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపిస్తాయన్న విషయాన్ని భారత ఆటగాళ్లు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు. గత ప్రపంచకప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచే భారత్‌ను జగజ్జేతగా నిలిపిన విషయాన్ని ప్రస్తుత టీమిండియా సభ్యులు గుర్తు పెట్టుకోవాలి.
క్యాచ్‌లు నేలపాలు చేసినా, మిస్ ఫీల్డింగ్ చేసి అదనపు పరుగులు సమర్పించుకున్నా, సరిదిద్దుకోవడానికి జరగబోయేది సామాన్యమైన మ్యాచ్ కాదు. ఒక్కసారి తప్పు జరిగిపోతే, ఎంతటి స్టార్ ఆటగాడైనా చరిత్ర హీనుడవ్వాల్సిందే. కాబట్టి, సెమీఫైనల్లో ప్రతి భారత ఆటగాడు ఫీల్డ్‌లో జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు.


