బీసీసీఐలో చేరిన హర్భజన్‌ సింగ్‌ | Harbhajan Singh Joins BCCI | Sakshi
Sakshi News home page

బీసీసీఐలో చేరిన హర్భజన్‌ సింగ్‌

Mar 2 2026 4:41 PM | Updated on Mar 2 2026 4:46 PM

Harbhajan Singh Joins BCCI

భారత మాజీ ఆఫ్‌ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బీసీసీఐలో చేరాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, యువ స్పిన్నర్లకు మార్గదర్శకత్వం చేయనున్నాడు. ఇప్పటికే మరో భారత మాజీ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ ఫాస్ట్ బౌలర్లతో పని చేస్తున్నాడు. తాజాగా హర్భజన్ సింగ్ ఈ  జాబితాలో చేరాడు.

బీసీసీఐ మార్చి మొదటి వారంలో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రోగ్రాంలో రెడ్ బాల్ స్పెషలైజ్డ్ క్యాంపులు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ శిబిరాలు అండర్-19 మరియు ఇండియా A జట్లలో ప్రతిభ చూపిన ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. వీరిని త్వరలోనే సీనియర్ జట్టులోకి తీసుకురావడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం.  

మరో దిగ్గజం కూడా..!
యువ బౌలర్లకు శిక్షణ ఇచ్చేందుకు భారత మాజీలు క్యూ కడుతున్నారు. జహీర్‌ ఖాన్‌, హర్భజన్‌ సింగ్‌ ఇప్పటికే రంగంలోకి దిగగా.. మరో దిగ్గజ బౌలర్‌ కూడా తన స్పెషలైజేషన్‌లో యువ బౌలర్లకు శిక్షణ​ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ లెగ్‌ స్పిన్నర్‌ అనిల్ కుంబ్లే రిస్ట్‌ స్పిన్నర్ల కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

ఈ మొత్తం కార్యక్రమాన్ని మరో భారత దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ సమన్వయం చేస్తున్నారు. ఇతర మాజీ ఆటగాళ్లను కూడా ఈ శిక్షణా కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి అతను సంప్రదింపులు జరుపుతున్నారు.  

కాగా, బీసీసీఐలో ఇలాంటి శిక్షణా శిబిరాలు కొత్తవి కావు. జగ్మోహన్ దాల్మియా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మాజీ ఆటగాళ్లను యువ క్రికెటర్లకు మార్గదర్శకులుగా ఆహ్వానించే పద్ధతి ప్రారంభమైంది. అప్పట్లో చందు బోర్డే, ఎరపల్లి ప్రసన్న, సయ్యద్ కిర్మాణి వంటి ప్రముఖులు జోనల్ అకాడమీ శిబిరాల్లో శిక్షణ ఇచ్చారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement