T20 WC 2026: చరిత్ర సృష్టించిన టీమిండియా | T20 WC 2026: India becomes the first team to reach 20 semi finals in ICC events | Sakshi
Sakshi News home page

T20 WC 2026: చరిత్ర సృష్టించిన టీమిండియా

Mar 2 2026 3:59 PM | Updated on Mar 2 2026 4:08 PM

T20 WC 2026: India becomes the first team to reach 20 semi finals in ICC events

భారత పురుషుల క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఈవెంట్లలో 20 సార్లు సెమీఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టీ20 ప్రపంచకప్‌ 2026లో సెమీస్‌కు చేరడంతో ఈ ఘనత సాధించింది. భారత్‌ తర్వాత అత్యధిక సార్లు ఐసీసీ ఈవెంట్లలో సెమీస్‌కు చేరిన జట్లుగా ఆస్ట్రేలియా (18), న్యూజిలాండ్‌ (18) ఉన్నాయి. ఆతర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్‌ (16), పాకిస్తాన్‌ (16), సౌతాఫ్రికా (15), శ్రీలంక (11), వెస్టిండీస్‌ (11), ఆఫ్ఘనిస్తాన్‌ (1), బంగ్లాదేశ్‌ (1), కెన్యా (1) జట్లు ఉన్నాయి.

ఐసీసీ ఈవెంట్లలో భారత్‌ సెమీస్‌కు చేరిన సందర్భాలు..
వన్డే వరల్డ్‌కప్‌- 8 సార్లు (1983, 1987, 1996, 2003, 2011, 2015, 2019, 2023)
టీ20 వరల్డ్‌కప్‌- 6 సార్లు (1998, 2000, 2002, 2013, 2017, 2025)
ఛాంపియన్స్‌ ట్రోఫీ- 6 సార్లు (2007, 2014, 2016, 2022, 2024, 2026*)

కాగా, టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నిన్న (మార్చి 1) జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించడంతో భారత్‌ సెమీస్‌కు అర్హత సాధించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్‌ (97 నాటౌట్‌) చారిత్రక ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను గెలిపించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా శాంసన్‌ సహనం కోల్పోకుండా కడదాకా క్రీజ్‌లో ఉండి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. 

మార్చి 4న జరిగే తొలి సెమీఫైనల్లో గ్రూప్‌ 1 టాపర్‌ సౌతాఫ్రికా, గ్రూప్‌-2లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌ ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా తలపడతాయి. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement