సంజూ కాదు!;.. అతడి రెండు ఫోర్లే కీలకం: బుమ్రా | Not Sanju Bumrah Says Dube cameo turning point in India win vs WI | Sakshi
Sakshi News home page

సంజూ కాదు!;.. అతడి రెండు ఫోర్లే కీలకం: బుమ్రా

Mar 2 2026 1:31 PM | Updated on Mar 2 2026 1:39 PM

Not Sanju Bumrah Says Dube cameo turning point in India win vs WI

టీమిండియా అద్భుతం చేసింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ కీలక పాత్ర పోషించాడు.

ఆద్యంతం నిలకడగా ఆడిన సంజూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తంగా 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్లో సిక్స్‌, ఫోర్‌ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

వచ్చీ రాగానే వరుసగా రెండు ఫోర్లు
అయితే, టీమిండియా గెలుపునకు 10 బంతుల్లో 17 పరుగులు అవసరమైన వేళ హార్దిక్‌ పాండ్యా (14 బంతుల్లో 17) ఐదో వికెట్‌గా వెనుదిరగగా.. శివం దూబే క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రాగానే వరుసగా రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఆఖరి ఓవర్లో విజయ సమీకరణం ఏడు పరుగులుగా మారగా.. సంజూ తొలుత సిక్స్‌, ఆ తర్వాత ఫోర్‌ బాది గెలుపు ఖరారు చేశాడు.

ఆ రెండు ఫోర్లు అత్యంత కీలకం
నిజానికి దూబే బాదిన రెండు ఫోర్ల వల్ల సంజూపై ఒత్తిడి తగ్గి మరింత స్వేచ్ఛగా బ్యాట్‌ ఝులిపించగలిగాడు. భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా ఇదే మాట అంటున్నాడు. ‘‘దూబే బాదిన ఆ రెండు ఫోర్లు అత్యంత కీలకం.

క్రికెట్‌ రికార్డులలో వాటికి చోటు లేకపోవచ్చు. కానీ క్రికెట్‌ గురించి పూర్తి అవగాహన ఉన్న వారికి వాటి ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది. ఆ రెండు ఫోర్లే ఒత్తిడిని తగ్గించాయి. చివరి ఓవర్లో 8-9 పరుగులు తీయడం కూడా ఒక్కోసారి కష్టం కావచ్చు.

సంజూ విషయంలో హ్యాపీ
ఏదేమైనా సంజూ విషయంలోనూ నేను సంతోషంగా ఉన్నాను. అతడు గత కొంతకాలంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. వాటన్నింటినీ అధిగమించి గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు రోజురోజుకీ మరింత గొప్పగా ఆడాలని కోరుకుంటున్నా’’ అని బుమ్రా పేర్కొన్నాడు. కాగా విండీస్‌తో మ్యాచ్‌లో బుమ్రా రెండు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.

చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Advertisement
 
Advertisement
Advertisement