వెస్టిండీస్‌తో సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఐదు వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత జట్టు సమం చేసింది.
సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడి
శ్రీలంకతో కలిసి వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న డిఫెండింగ్ చాంపియన్ భారత్.. లీగ్ దశలో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, సూపర్-8 దశలో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
వరుస విజయాలతో సెమీస్‌కు
అయితే, తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వే (IND vs ZIM)ను భారీ తేడాతో ఓడించి సెమీ ఫైనల్ రేసులో ముందుకు వచ్చిన భారత్.. ఆదివారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్ (IND vs WI)ను చిత్తు చేసి బెర్తును ఖరారు చేసుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు సాధించింది.
విండీస్ బ్యాటర్లలో రోవ్‌మన్ పావెల్ (19 బంతుల్లో 34), జేసన్ హోల్డర్ (22 బంతుల్లో 37) అజేయ ఇన్నింగ్స్‌తో అలరించగా.. ఓపెనర్ రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 40) టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
సంజూ స్పెషల్
ఇక లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో తడబడినా ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) జట్టును విజయతీరాలకు చేర్చాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచి గెలుపును ఖరారు చేశాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.
Man on a mission! 🚀
Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌
ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026
పాక్ ప్రపంచ రికార్డు సమం
కాగా టీమిండియా టీ20 ప్రపంచకప్ టోర్నీలో సెమీస్ చేరడం ఇది ఆరోసారి. తద్వారా పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది. ఇక ఇదే ఎడిషన్‌లో అందరి కంటే ముందే సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న ఇంగ్లండ్ సైతం ఆరోసారి సెమీ ఫైనల్లో అడుగుపెట్టి.. పాక్, భారత్ సరసన నిలిచింది. ఇక గురువారం నాటిమ్యాచ్‌లో ఫైనల్ బెర్తు కోసం టీమిండియా ఇంగ్లండ్ మధ్యమ్యాచ్ జరుగుతుంది. ఇందుకు ముంబై వేదిక.
టీ20 ప్రపంచకప్ టోర్నీలో అత్యధికసార్లు సెమీ ఫైనల్ చేరిన జట్లు ఇవే
👉పాకిస్తాన్- ఆరుసార్లు (2007, 2009, 2010, 2012, 2021, 2022)
👉టీమిండియా- ఆరుసార్లు (2007, 2014, 2016, 2022, 2024, 2026)
👉ఇంగ్లండ్- ఆరుసార్లు (2010, 2016, 2021, 2022, 2024, 2026
చదవండి: ఇది సరిపోతుందా బాస్!.. విమర్శలకు సంజూ ’స్టైల్’ కౌంటర్


