T20 WC: పీసీబీ సంచలన నిర్ణయం.. ఆటగాళ్లకు భారీ షాక్‌! | PCB imposes Huge fine on Pakistan players flopped in T20 WC: Report | Sakshi
Sakshi News home page

T20 WC: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సంచలన నిర్ణయం.. ఆటగాళ్లకు భారీ షాక్‌!

Mar 2 2026 11:15 AM | Updated on Mar 2 2026 11:31 AM

PCB imposes Huge fine on Pakistan players flopped in T20 WC: Report

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో విఫలమైన కారణంగా ఆటగాళ్లకు ఊహించని షాకిచ్చినట్లు సమాచారం. బాగా ఆడినపుడు రివార్డులు తీసుకున్నట్లే.. చెత్త ప్రదర్శన కనబరిచినప్పుడు జరిమానా కట్టాల్సిందేనని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది.

టీమిండియా చేతిలో చిత్తు
టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌ జట్లతో కలిసి పోటీపడింది పాకిస్తాన్‌. గ్రూప్‌ దశలో నెదర్లాండ్స్‌, అమెరికా, నమీబియా జట్లపై గెలిచిన సల్మాన్‌ ఆఘా బృందం.. దాయాది టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది.

అయితే, మిగిలిన జట్లపై విజయాల కారణంగా భారత్‌తో కలిసి సూపర్‌-8లో అడుగుపెట్టింది పాకిస్తాన్‌. సెమీస్‌ చేరాలంటే కీలకంగా మారిన ఈ దశలో న్యూజిలాండ్‌తో ఆడాల్సిన తొలి మ్యాచ్‌ వర్షం వల్ల టాస్‌ పడకుండానే రద్దై పోయింది. అనంతరం ఇంగ్లండ్‌ చేతిలో పాక్‌ ఓటమిపాలైంది.

లంకపై గెలిచినా..
సూపర్‌-8లో ఆఖరిదైన మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడి గెలిచినప్పటికీ నెట్‌ రన్‌రేటు కారణంగా వెనుకబడి.. పాక్‌ సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించింది. గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌ చేరగా.. శ్రీలంకతో కలిసి పాకిస్తాన్‌ ఇంటిబాట పట్టింది.

అపుడు లీగ్‌ దశలోనే
ఇక గత ఎడిషన్‌లోనూ పాక్‌ సెమీస్‌ చేరకుండా లీగ్‌ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈసారి సూపర్‌-8కు చేరినా.. సెమీస్‌ రేసులో మాత్రం వెనుబడిపోయి తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్‌ మొహ్సిన్‌ నక్వీ సల్మాన్‌ ఆఘా బృందంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

భారీ జరిమానా!
ఈ నేపథ్యంలోనే విఫలమైన ఆటగాళ్లకు భారీ పనిష్‌మెంట్‌ ఇచ్చేందుకు పీసీబీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ కథనం ప్రకారం.. పాక్‌ జట్టులోని ఆటగాళ్లకు ఒక్కొక్కరికి పాక్‌ కరెన్సీలో యాభై లక్షల రూపాయలు (భారత కరెన్సీలో దాదాపు 16.28 లక్షలు) జరిమానా విధించనున్నట్లు సమాచారం.

టీమిండియా చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ మేరకు పీసీబీ నుంచి పాక్‌ ఆటగాళ్లకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ‘‘మెరుగైన ప్రదర్శనలు ఇచ్చినపుడు రివార్డులు తీసుకునే ఆటగాళ్లు.. చెత్త ప్రదర్శనలకు పెనాల్టీ కట్టాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు’’ అని సదరు కథనం పేర్కొంది. ముఖ్యంగా పీసీబీ వార్షిక కాంట్రాక్టులో అత్యధిక వేతనం అందుకుంటున్న ఆటగాళ్లకు జరిమానా ఇంకాస్త ఎక్కువే ఉండవచ్చని తెలిపింది.

టీ20 ప్రపంచకప్‌-2026లో పాల్గొన్న పాకిస్తాన్‌ జట్టు
సయీబ్‌ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్‌), బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్ (వికెట్‌ కీపర్‌), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్, ఫఖర్‌ జమాన్‌, ఖవాజా నఫాయ్‌, నసీం షా, ఉస్మాన్‌ తారిఖ్‌.

చదవండి: అతడొక వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌.. అందుకే మద్దతు: గంభీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement