కోల్‌కతా: టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 మ్యాచ్ లో భారత్‌కు 196 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది వెస్టిండీస్, ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఆది నుంచి బ్యాట్ ఝుళిపించింది. ఓపెనర్లు షాయ్ హోప్( 32: 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), రోస్టన్ ఛేజ్(40: 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)లు చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తరువాత హెట్ మెయిర్ ( 27: 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్ లు) చెలరేగి ఆడే యత్నం చేశాడు. విండీస్ స్కోరు బోర్డు వేగం పుంజుకునే క్రమంలో బూమ్రా బౌలింగ్ లో హెట్ మెయిర్ అవుటయ్యాడు.
బూమ్రా బౌలింగ్ లో సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు హెట్ మెయిర్. అప్పటికి విండీస్ స్కోరు 11.3 ఓవర్లలో 102 పరుగులుగా ఉంది. అయితే హెట్ మెయిర్ రెండో వికెట్‌గా ఔటైన తర్వాత విండీస్ స్కోరు బోర్డులో వేగం తగ్గింది. అయితే రావెన్ పావెల్(34 నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాసన్ హోల్డర్(37 నాటౌట్; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఈ జోడి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. వీరిద్దరూ 35 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బూమ్రా రెండు వికెట్లు సాధించగా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.
భారత బౌలర్లలో బుమ్రా మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. బుమ్రా నాలుగు ఓవర్లలో 36 పరుగులే ఇవ్వగా, హార్దిక్ పాండ్యా తన నాలుగు ఓవర్ల కోటాలో 40 పరుగులు, అర్షదీప్ 43 పరుగులు, వరుణ్ చక్రవర్తి 40 పరుగులు ఇచ్చారు. అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు.

పావెల్ అరుదైన ఘనత
ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా రోవ్‌మాన్ పావెల్ అరుదైన ఘనతను సాధించాడు. విండీస్ తరుఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. పావెల్ టీ20ల్లో 150 సిక్సర్లు మార్కును చేరుకోవడంతో విండిస్ తరుఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో నికోలస్ పూరన్ 149 సిక్సర్లు కొట్టిన జాబితాలో ఉండగా, వెవిన్ లూయిస్ 136 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక క్రిస్ గేల్ 124 సిక్సర్లతో నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు.పొలార్డ్, హెట్‌మెయిర్‌లు 99 సిక్సర్లతో ఆ తర్వాత స్థానంలో ఉన్నారు.


