ఈడెన్‌లో ఈ సండే పరుగుల పండగే | India and West Indies face crucial battle over batting pitch | Sakshi
Sakshi News home page

ఈడెన్‌లో ఈ సండే పరుగుల పండగే

Feb 28 2026 3:57 AM | Updated on Feb 28 2026 3:57 AM

India and West Indies face crucial battle over batting pitch

బ్యాటింగ్‌ పిచ్‌పై భారత్, విండీస్‌ల కీలక పోరు

ఇరు జట్ల బ్యాటర్లు ఫామ్‌లో 

పిచ్‌పై సుదీర్ఘ సమీక్ష చేసిన గంగూలీ 

కోల్‌కతా: భారత్, వెస్టిండీస్‌ల మధ్య రేపు జరిగే మ్యాచ్‌ ఈ టి20 ప్రపంచకప్‌కే ‘పైసా వసూల్‌’ మ్యాచ్‌ కానుంది. ముమ్మాటికి క్వార్టర్‌ ఫైనల్‌గా జరిగే ‘సూపర్‌–8’ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సెమీఫైనల్‌ చేరుతుంది. ఆదివారం జరిగే మ్యాచ్‌ కోసం వినియోగించే పిచ్‌ గురించి క్యూరేటర్‌ సుజన్‌ ముఖర్జీ ఆసక్తికర విషయం వెల్లడించగా... బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ శుక్రవారం పిచ్‌పై సుదీర్ఘంగా సమీక్షించినట్లు తెలిసింది. 

ఈ వరల్డ్‌కప్‌లో స్కాట్లాండ్, ఇటలీ జట్ల మధ్య గ్రూప్‌–సి లీగ్‌ మ్యాచ్‌కు వేదికైన పిచ్‌పైనే ఆదివారం కీలక సూపర్‌–8 పోరు జరుగుతుందని క్యూరేటర్‌ ముఖర్జీ వెల్లడించారు. ఈడెన్‌ పిచ్‌పై జరిగిన ఆ రెండో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 207/4 స్కోరు చేసింది. తర్వాత ఇటలీని 134 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఈ నేపథ్యంలో భారత్, కరీబియన్‌లాంటి మేటి జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లోనూ పరుగుల విందు గ్యారంటీ కావడంతో ఈడెన్‌ గార్డెన్స్‌ కిక్కిరిసి పోతుందని క్రికెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. 

బ్యాటర్ల మెరుపులకే కాదు నాణ్యమైన స్పిన్‌కూ ఈడెన్‌ అచ్చొచ్చే వేదికని ఎన్నోమార్లు రుజువైంది కూడా! ఇటలీపై స్కాట్లాండ్‌ స్పిన్నర్లు మైకేల్‌ లిస్క్‌ (4/17), మార్క్‌ వ్యాట్‌ (2/24) 6 వికెట్లతో అదే నిరూపించారు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ స్వయంగా ఈడెన్‌ గార్డెన్స్‌లోకి వెళ్లి పిచ్‌ను తదేకంగా పరిశీలించారు. క్యూరేటర్‌తో వికెట్‌ పరిస్థితిపై చర్చించారు. అలాగే బోర్డు చీఫ్‌ క్యూరేటర్‌ ఆశిష్‌ భౌమిక్‌ను కూడా కలిసి సమీక్షించారని ‘క్యాబ్‌’ వర్గాలు తెలిపాయి. వికెట్‌తో పాటు స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement