ఉక్రెయిన్‌తో శాంతి చర్చలను ఐరోపా సమాఖ్యనే అడ్డుకుంటోంది
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపణ
మాస్కో: నాలుగేళ్ల యుద్ధానికి ఇకనైనా ముగిద్దామని భావిస్తుంటే యురోపియన్ యూనియన్ సభ్యదేశాలు అడ్డు తగులుతున్నాయని రష్యా( Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. మంగళవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జరేడ్ కుష్నర్, ఆ దేశ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్‌ల ప్రతినిధి బృందం మంగళవారం రష్యా అధ్యక్షభవనం క్రిమ్లిన్‌లో పుతిన్‌తో భేటీ అయింది. ఆ తర్వాత పుతిన్ మాట్లాడారు. ‘‘ శాంతి ఒప్పందం విషయంలో ట్రంప్‌కు, యురోపియన్ యూనియన్ దేశాలకు మధ్య సఖ్యత లేదనుకుంటా.
నిజానికి ఉక్రెయిన్(Ukraine)లో శాంతి కపోతాలు ఎగరడం ఈయూ దేశాలకు ఇష్టం లేదనుకుంటా. శాంతి చర్చలకు ఈ దేశాలే విఘాతం కల్గిస్తున్నాయి. నిజానికి ఈయూ దేశాలతో యుద్ధానికి దిగడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. కానీ వాళ్లు యుద్ధానికే మొగ్గుచూపితే రణరంగంలోకి దూకేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఈయూ దేశాలకు స్పష్టమైన శాంతి అజెండా లేదు. చూస్తుంటే వాళ్లు యుద్ధానికే మొగ్గుచూపుతున్నట్లు కని్పస్తోంది. వాళ్లు చేసిన శాంతి ఒప్పంద ప్రతిపాదనలు రష్యాకు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఈ ప్రతిపాదనలు మొత్తం శాంతి ప్రక్రియను స్తంభింపజేసేలా ఉన్నాయి. అదే వాళ్ల లక్ష్యం అనుకుంటా’’ అని పుతిన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.


