ప్యాసింజర్‌ రైలుపై రష్యా దాడి.. షాకింగ్‌ వీడియో.. | Russia Strikes In Ukraine And Target Passenger Train | Sakshi
Sakshi News home page

ప్యాసింజర్‌ రైలుపై రష్యా దాడి.. షాకింగ్‌ వీడియో..

Jan 28 2026 12:19 PM | Updated on Jan 28 2026 12:47 PM

Russia Strikes In Ukraine And Target Passenger Train

కీవ్‌: ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను టార్గెట్‌ చేసి రష్యా సైన్యం దాడులకు పాల్పడుతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా డ్రోన్ల సాయంతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్‌లో ప్యాసింజర్‌ రైలుపై జరిగిన రష్యా దాడిలో నలుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రష్యా సైన్యం దాడులకు సంబంధించిన వీడియో​ బయటకు వచ్చింది. 

రష్యన్ దళాలు మంగళవారం రాత్రి ఉక్రెయిన్ అంతటా వరుస దాడులు ప్రారంభించాయి. ఈశాన్య ఖార్కివ్ ప్రాంతంలోని ప్యాసింజర్ రైలుతో సహా పౌర మౌలిక సదుపాయాలను నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు. దాదాపు 200 మందితో ప్రయాణిస్తున్న ఇంటర్‌సిటీ ప్యాసింజర్ రైలు టార్గెట్‌గా రష్యా సైన్యం డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్టు ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. 

 

దక్షిణ ఉక్రెయిన్‌లోని ఒడెసా నగరంపై రష్యా జరిపిన డ్రోన్‌ దాడిలో ఇద్దరు పిల్లలు, ఒక గర్భిణి సహా 23 మంది గాయపడ్డారని అధికారులు మంగళవారం తెలియజేశారు. ఈ దాడికి 50 డ్రోన్లను ఉపయోగించారని వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని పవర్‌గ్రిడ్‌ లక్ష్యంగా ఈ దాడి జరిగిందని వివరించారు. రష్యా దాడిలో ఐదు అపార్ట్‌మెంట్లు దెబ్బతిన్నాయని తెలిపారు. మొత్తంగా గత కొద్ది రోజులుగా రష్యా దాడుల కారణంగా 12 మంది మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు.

తాజాగా రష్యా దాడులపై జెలెన్‌స్కీ స్పందిస్తూ.. రష్యా దాడిని పూర్తిగా ఉగ్రవాద దాడి అని అభివర్ణించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. ఏ దేశంలోనైనా, పౌర రైలుపై డ్రోన్ దాడిని సరిగ్గా అదే విధంగా పరిగణిస్తారు.. పూర్తిగా ఉగ్రవాదంగా పరిగణిస్తారు. ఇందులో ఎటువంటి సైనిక ఉద్దేశ్యం లేదు.. ఉండకూడదు అని టెలిగ్రామ్‌లో పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించడానికి మాస్కోపై ప్రపంచ ఒత్తిడిని తీవ్రతరం చేయాలని ఆయన కోరారు. భవనాలు దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని అపార్ట్‌మెంట్‌ శిథిలాల కింద చిక్కుకున్నవారి పరిస్థితి తెలియాల్సి ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ తెలిపారు. యుద్ధాన్ని నిలిపేందుకు ప్రయత్నాలను అమెరికా వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement