అసలైన సాహిత్యజీవికి వర్తమానం ఎలాంటి కిరీటమూ పెట్టకపోవచ్చు, కానీ చరిత్ర అతడిని తగిన విధంగా ఆశీర్వదిస్తుందనడానికి ఐజాక్ బేబెల్ జీవితమే ఉదాహరణ. అయితే ఆ వర్తమానపు విషాదం చరిత్ర ఎప్పటికీ తుడుచుకోలేని మచ్చ. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో భాగమైన ఉక్రెయిన్‌లో జన్మించిన ఈ యూదు తన మాతృభాష యిడ్డిష్‌ను కాదని రష్యన్‌ను రచనా భాషగా ఎంచుకున్నాడు. సోవియట్ రష్యా ఆకాంక్షలకు అనుగుణంగా నిలిచాడు. పోలిష్–సోవియట్ యుద్ధ సమయంలో రచయిత గోర్కీ సూచన మీద పాత్రికేయుడిగా పనిచేసిన బేబెల్ ఆ యుద్ధం తాలూకు చీకటి, బీభత్సాల చేదు వాస్తవికతను ‘రెడ్ కావల్రీ’ కథలుగా అందించాడు. 1926లో తొలిసారి ప్రచురితమైన ఈ కథలకు ఇది శతాబ్ది సంవత్సరం.
అత్యంత సంక్షిప్తంగా రాయడం, ఉన్నట్టుండి కథను మరో తలంలోకి కొనిపోవడం, ‘సాల్ట్’ కథ గురించి బోర్హెస్ అన్నట్టు– కవిత్వానికే సాధ్యమై మననానికి వీలుండే లయను కథలో సాధించడం బేబెల్ గొప్పతనం. రెడ్ కావల్రీ, తను పుట్టి పెరిగిన ఒడెస్సా పట్టణం నేపథ్యంలో ‘ఒడెస్సా స్టోరీస్’, ఇంకా రెండు నాటకాలు, ఒక సినిమాకు స్క్రీన్‌ప్లే మాత్రమే రాసిన బేబెల్(1894–1940) వచనంలో కరుణ, కాఠిన్యం కలగలసి మనసును మెలిపెడతాయి.
యుద్ధభూమి తాలూకు బహుముఖ పార్శా్వలనూ, అత్యంత సున్నితమైన మనిషి కూడా అనూహ్య కార్యాలకు సిద్ధమయ్యే విపరిణామాలనూ ఆయన చిత్రించాడు. సాధారణ జీవితం గడపాలని కోరుకుంటూ రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న నిస్సహాయ మానవులు అందులో కనబడతారు. చావు వాసన వేసే కథలు ఆయనవి! యుద్ధం అనేది యుద్ధ క్షేత్రానికే పరిమితమై ఉండదని కూడా ఈ కథలు చెబతాయి.
కమ్యూనిస్టు వ్యతిరేకి కాకపోయినా బేబెల్ ప్రాపగాండా వ్యతిరేకి. దాంతో విమర్శను తట్టుకోలేని రాజ్యం ఆయన్ని సోవియట్ యూనియన్‌లో ‘నాన్–పర్సన్’ చేయడానికి పూనుకుంది. 1933 నుంచే ఆయన పుస్తకాలను ఉపసంహరించడం మొదలైంది. స్టాలిన్ హయాంలోని ‘సామ్యవాద వాస్తవికత’కు తగ్గట్టుగా రచయితలు తమ పాత రచనలను తిరగరాస్తున్న వేళ, తనను తాను సరిచేసుకోవడం ఇష్టంలేని బేబెల్ మౌనం అనే కొత్త సాహిత్య ప్రక్రియలో రాణిస్తున్నానని చెప్పుకొన్నాడు.
ఇక ‘ప్రజా శత్రువు’గా అరెస్టయిన తర్వాత బేబెల్ మీద ట్రాట్స్‌కీయిస్టు, ఉగ్రవాదం, గూఢచర్యం లాంటి కేసులు పెట్టారు. ఆయన పేరును సాహిత్య నిఘంటువుల్లోంచీ, ఎన్‌సైక్లోపీడియాలోంచీ తొలగించారు. ఆయన గురించి ఏ సాహిత్య కార్యక్రమంలోనూ ఎత్తడానికి లేదు. బేబెల్ అనే మనిషి లేనట్టుగానే వ్యవహరించారు. ఆధునిక సోషల్ మీడియా యుగంలో జడలు విప్పిన ‘క్యాన్సిల్ కల్చర్’ అనేదానికి ఆ కాలంలో బీజాలున్నాయి. 1940 జనవరి 16న పార్టీకీ, సోవియట్ ప్రభుత్వానికీ శత్రువులైన 457 మంది జాబితా స్టాలిన్‌కు అందింది.
అందులో బేబెల్ సహా 346 మందిని కాల్చేయాలన్న సిఫారసు ఉంది. జనవరి 27న మధ్యాహ్నం 1:30కు 45 ఏళ్ల బేబెల్‌కు కాల్చివేత శిక్ష అమలైంది. బేబెల్ సమగ్ర రచనలను ఆంగ్లంలోకి అనువదించిన పీటర్ కాన్‌స్టంటీన్ ఈ మరణ శిక్షను ‘ఇరవయ్యో శతాబ్ద సాహిత్యపు అతి దారుణ విషాదాల్లో ఒకటి’గా అభివర్ణించారు. 1954లో కృశ్చేవ్ పాలనలో బేబెల్‌ను నిరపరాధిగా ప్రకటించిన తర్వాతగానీ ఆయన రచనలు మళ్లీ వెలుగు చూడలేదు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ తన గతాన్ని పునఃసమీక్షించుకుంటూ, కొత్త చరిత్రను లిఖించకుంటున్న వేళ, అక్కడి మేధావర్గంలో బేబెల్ మీద సంక్లిష్ట స్పందన ఉంది. కానీ ’(ఉక్రెయిన్) అంధత్వం, అశక్తత, ఆ ఆశక్తత లోంచి పుట్టిన తెలియని కఠినత్వం’ గురించి రాసిన బేబెల్ సృజన విస్మరించలేనిదని పొలిటికల్ సైంటిస్ట్ వాలెంటీన్ బుషాన్‌స్కీ అంటారు. ఒక దిశ లేకుండా పుస్తకాలు చదువుతున్న భార్య ఆంటోనినా పీరుష్కోవాకు అనవసర పుస్తకాల మీద సమయం వృథా చేసుకోకుండా ముఖ్యమైన క్లాసిక్స్ ఏవి చదవాలో ఒక జాబితా ఇస్తాడు బేబెల్. చదవడం ఎంత ముఖ్యమో, ఏవి చదవాలో తెలియడం అంతకన్నా ముఖ్యం. ఆ జాబితాలో మనం బేబెల్‌ను కలుపుకోవచ్చు.


