ఊహించని నిర్ణయాలతో తరచు అందరినీ ఆశ్చర్యపరిచే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈసారి మాత్రం దిగ్భ్రాంతిలో ముంచెత్తారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుని గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయటంతో జేడీ(యూ) అగ్రనాయకులే ఖిన్నులయ్యారు. వారికి కేవలం కొన్ని గంటలముందు మాత్రమే తెలిసింది మరి. పదేళ్లుగా తన పదునైన వ్యూహాలతో దేశంలో బీజేపీ ఎదుగుదలకు చక్రం తిప్పుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాయే ఈ ఊహించని పరిణామానికి కూడా బాధ్యులని మీడియా కథనాలు చెబుతున్నాయి.
నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన నితీశ్ వాస్తవానికి తన కుమారుడికి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని నెల్లాళ్లుగా బీజేపీ అగ్రనేతలను అడుగుతూ వస్తున్నారు. తీరా ఆయన హఠాత్తుగా స్వరం మార్చారు. మధ్యమధ్య కొత్త పొత్తులతో జనం ముందుకెళ్తున్నా మెజారిటీ కాస్త అటూ ఇటూఅయింది తప్ప గత 20 సంవత్సరాలుగా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగారు.
తాను రాష్ట్రంలో ఉభయ సభలతోపాటు లోక్‌సభ సభ్యుడిగా కూడా పనిచేశాననీ, రాజ్యసభకు వెళ్లలేదన్న అసంతృప్తిని పోగొట్టుకోవటానికే తాజా నిర్ణయం తీసుకున్నాననీ ఆయన చెబుతున్న మాటల్ని మద్దతుదారులు విశ్వసించటం లేదు. పార్టీలో అంతఃకలహాలు, సహకరించని ఆరోగ్యం ఆయన తాజా నిర్ణయానికి కారణమన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
బిహార్ రాజకీయాలపై నితీశ్ ముద్ర చెరగనిది. 1974 నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమ నేతగా ముందుకొచ్చిన విద్యార్థి నాయకుల్లో నితీశ్ ఒకరు. 90వ దశకం నుంచీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనదే కీలక భూమిక. తనతోపాటు రాజకీయాల్లో అడుగుపెట్టిన లాలూ ప్రసాద్ యాదవ్, రాంవిలాస్ పాశ్వాన్‌లతో పోలిస్తే నితీశ్ వ్యూహ చతురత గలిగినవారు. అందుకే ‘సామాజిక న్యాయ’ రాజకీయాల ప్రభావం గణనీయంగా ఉన్న రాష్ట్రంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో లేని కుర్మీ సామాజిక వర్గం నుంచి వచ్చినా అందరినీ ఆకట్టుకోగలిగారు.
అత్యంత వెనుకబడిన కులాలకూ(ఈబీసీ), దళితుల్లో అట్టడుగు వర్గాలకూ పదవుల పంపకంలో ప్రాధాన్యమీయటంతోపాటు తన కుర్మీ సామాజిక వర్గాన్నీ, కుష్వాహాలనూ ఏకం చేశారు. ఆయన విజయాలకు ఈ సమీకరణాలొక్కటే కాదు... వాటితోపాటుæరాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించి ‘మంచి పాలన’ అందిస్తున్నా రన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించగలిగారు. ఆయనకు ‘సుశాసన్ బాబు’ అనే పేరు వచ్చింది అందుకే!
కూటమిలో జూనియర్ భాగస్వామిగా చేరినా, అచిరకాలంలోనే అగ్రభాగానికి ఎగబాకుతుందని బీజేపీపై ఇప్పటికే ముద్రపడింది. మహారాష్ట్రలో జరిగింది ఇదే. ఇప్పుడు బిహార్‌లోనూ ఇదే కొనసాగుతోంది. కేంద్రంలో ఎన్డీయే మనుగడకు జేడీ(యూ) మద్దతు తప్పనిసరైనా, రాష్ట్రంలో ఆ పార్టీ సారథ్యాన్ని తప్పించటం చిన్న విషయమేమీ కాదు. 2020 ఎన్నికల్లో తొలిసారి జేడీ(యూ)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో బీజేపీ కన్నా తనకు అదనంగా ఒక్క స్థానమైనా కావాలని పట్టుబట్టి తీసుకున్న ఆ పార్టీకి తీరా 43 మాత్రమే లభించాయి.
బీజేపీకి ఆ ఎన్నికల్లో వచ్చినవి 74. అందుకే సీఎం పదవి నిలుపుకోవటంపై సంశయం ఏర్పడి నితీశ్ మధ్యలో ఆర్జేడీ వైపు వెళ్లారు. ఆ చెలిమి ఎన్నాళ్లో కొనసాగలేదు. తిరిగి ఎన్డీయే గూటికి చేరారు. మొన్న నవంబర్‌లో జేడీ(యూ)కు 85 లభించగా, బీజేపీ గెల్చుకున్నవి 89. అధిక స్థానాలున్న పక్షంగా సీఎం పదవి అడగాల్సి ఉన్నా తాత్కాలికంగా బీజేపీ వెనక్కుతగ్గింది. అదును చూసి నాలుగు నెలల్లో సాధించింది. పార్టీకి ప్రధాన వనరైన మహిళలు, రైతులు బీజేపీ వైపు మొగ్గుతున్నారన్న సమాచారంతో జేడీ(యూ) నేతలు అప్రమత్తమవుతున్నట్టు కథనాలు వచ్చాయి. అందుకే ఇక ఆలస్యం చేయరాదని బీజేపీ భావించినట్టు కనబడుతోంది.
నితీశ్ నిష్క్రమణ, బీజేపీ ఆగమనంతో బిహార్ రాజకీయాల్లో సోషలిస్టు నేపథ్యంగల ప్రాంతీయ పార్టీల పాత్ర కొడిగడుతుంది. రాజ్యసభకు వెళ్లినా బిహార్‌లో తన ముద్రఉంటుందని నితీశ్ చెబుతున్నా అది ఆచరణలో సాధ్యపడదు. ఒకటి నిజం – ఇప్పటికీ బిహార్ నిరుపేద రాష్ట్రాల్లో ఒకటిగానే ఉంది. తన ఏలుబడిలో బీజేపీ దాని ముఖచిత్రాన్ని ఏ మేరకు మార్చగలదో వేచిచూడాలి.


