క్రయోజెనిక్స్ చాంబర్‌ల్లో మృతదేహాలు భద్రం
మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో మానవదేహాలు
రక్తం స్థానంలో ‘క్రయోప్రొటెక్టెంట్’
శరీరాన్నంతటినీ భద్రపర్చేందుకు రూ.2.5 కోట్ల వరకు ఖర్చు
మెదడును మాత్రమే భద్రపర్చేందుకు రూ.కోటిన్నర
అమెరికా, రష్యాల్లో ఈ ఖర్చుల కోసం లైఫ్ ఇన్సూ్యరెన్స్ పాలసీలు
సాక్షి, అమరావతి: మరణం అనేది జీవనానికి చివరి అంకమే. అయితే ఆధునిక సాంకేతికతపై అపారమైన నమ్మకం ఉన్న కొంతమంది ఈ భావనకే సవాల్ విసురుతున్నారు. ‘ఈరోజు కాకపోయినా వందల వేల ఏళ్ల తర్వాతైనా సైన్స్ మళ్లీ బ్రతికించగలదన్న ఆశతో’ తమ శరీరాలను భద్రపర్చుకుంటున్నారు. ఈ విధానమే క్రయోజెనిక్స్. సాధారణంగా ఎవరైనా చనిపోయాక అంత్యక్రియలు నిర్వహిస్తారు.
మరికొంతమంది వైద్య పరిశోధనల కోసం తమ దేహాలను దానం చేస్తారు. కానీ, ప్రపంచంలోని కొంతమంది అత్యంత ధనవంతులు మాత్రం మరణించిన తర్వాత తమ శరీరాలను లేదా మెదడును అత్యాధునిక క్రయోజెనిక్స్ చాంబర్లలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో గడ్డకట్టించి భద్రపర్చుకుంటూ భవిష్యత్‌పై ఆశలు పెంచుకుంటున్నారు.
ఖర్చు ఘనం..
క్రయోజెనిక్స్ అనేది శాస్త్రీయ ప్రక్రియ. మరణించిన వెంటనే, శరీరాన్ని అత్యంత వేగంగా మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో (లిక్విడ్ నైట్రోజన్) గడ్డకట్టిస్తారు.ఈ స్థాయిలో ఉష్ణోగ్రత ఉంటే, కణజాలంలో ఎలాంటి రసాయన మార్పులూ జరగవు. ఈ ప్రక్రియలో రక్తాన్ని పూర్తిగా బయటకు తీసి దాని స్థానంలో క్రయోప్రొటెక్టెంట్ అనే ద్రవాన్ని ప్రవేశపెడతారు. కణాలు దెబ్బతినకుండా, శరీరం లేదా మెదడును ‘కాలం నిలిపిన’ స్థితిలో భద్రపరుస్తారు.
లిక్విడ్ నైట్రోజన్‌లో ఉన్న శరీరానికి కాలంతో సంబంధం ఉండదు. కణజాలం పాడయ్యే ప్రక్రియ పూర్తిగా ఆగిపోతుంది. ఇలా వందల, వేల ఏళ్లు భద్రపరచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూర్తి శరీరం భద్రపర్చాలంటే భారతీయ కరెన్సీలో రూ.1.60 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకు, మెదడు మాత్రమే భద్రపర్చాలంటే రూ.కోటిన్నరకు పైగా ఖర్చవుతుందని అంచనా. అమెరికా, రష్యా దేశాల్లో ఇందుకోసం ఇన్సూ్యరెన్స్ కంపెనీలు కవరేజ్ కూడా కల్పిస్తుండటం విశేషం. ఇప్పటికే 500 మందికి పైగా మరణానంతరం తమ శరీరాలు, మెదడును ఈ క్రయోజెనిక్స్ చాంబర్స్‌లో భద్రపర్చుకున్నారు.
అధ్యయనాల్లో భిన్నాభిప్రాయాలు..
క్రయోజెనిక్స్ అంశంపై ఇటీవల కాలంలో ప్రపంచంలోని ప్రముఖ వర్సిటీలు, వైద్య పరిశోధన సంస్థలు అనేక అధ్యయనాలు చేస్తున్నాయి. అమెరికాలో ఆల్కార్ లైఫ్ ఎక్స్‌టెన్షన్ ఫౌండేషన్ (ఆరిజోనా), క్రయోజనిక్స్ ఇన్‌స్టిట్యూట్ (మిచిగావ్)ల్లో విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (యూకే) జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్–2023తో పాటు హార్వర్డ్ మెడికల్ స్కూల్ (యూఎస్‌ఏ) తమ బ్రిటిష్ మెడికల్ జర్నల్–2023లో ప్రచురితమైన పరిశోధనా పత్రంలో ఈ క్రయోజెనిక్స్‌పై ప్రత్యేకంగా ప్రస్తావించాయి.
అయితే కాలిఫోర్నియా వర్సిటీ న్యూరో సైన్స్‌పై జరిపిన అధ్యయనంలో మెదడును గడ్డకట్టిన తర్వాత జ్ఞాపకాలు, నాడి సంబంధాలు పూర్తిస్థాయిలో తిరిగి పనిచేయడం అత్యంత క్లిష్టమని పేర్కొంది. మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ (జర్మనీ) తమ క్రియో బయోలజీ జర్నల్–2024లో కణజాలాన్ని గడ్డకట్టే ప్రక్రియలోనే సూక్ష్మస్థాయిలో నష్టం జరుగుతుందని పేర్కొంది. చిన్న అవయవాల పునరుద్ధరణ వరకే విజయం సాధ్యమైందని, పూర్తి మానవశరీర పునరుద్ధరణ ఇంకా సాధ్యం కాలేదని తెలిపింది.
ఏ దేశాల్లో ముందున్నాయి..
క్రయోజెనిక్స్ రంగంలో అమెరికా, రష్యా దేశాలు ముందున్నాయి. చైనా ఇటీవలే ఈ అంశంపై పరిశోధనలు సాగిస్తోంది. కెనడా, యూరప్,జర్మనీ, స్విట్జర్లాండ్, యూకేల్లో పరిమిత స్థాయిలో పరిశోధనలు జరుగుతుండగా, ఆ్రస్టేలియాలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా క్రయోజెనిక్ పేషెంట్లు (మరణానంతరం) ఉన్న దేశంగా అమెరికా రికార్డుల్లోకెక్కింది.
ఆ తర్వాత రష్యా కూడా ఈ తరహా సదుపాయాలను కల్పించింది. రష్యాలోని క్రియోరుస్ అనే సంస్థ పూర్తి శరీరం, మెదడు భద్రపరిచే సదుపాయం కలిగి ఉంది. సైన్స్‌పై అతి నమ్మకం, డబ్బు ఇచ్చే ధైర్యం..కోల్పోయేదేముందన్న భావన ఈ తరహా ప్రయోగాలకు పురిగొల్పుతుందంటున్నారు.


