భారత యుద్ధనౌకల మోహరింపు | Indian Navy warships on standby near Persian Gulf to assist merchant vessels | Sakshi
Sakshi News home page

భారత యుద్ధనౌకల మోహరింపు

Mar 15 2026 5:02 AM | Updated on Mar 15 2026 5:06 AM

Indian Navy warships on standby near Persian Gulf to assist merchant vessels

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ సమీపంలో భారత నావికాదళానికి చెందిన పలు యుద్ధనౌకలను మోహరించారు. అవసరమైనప్పుడు వాణిజ్య నౌకలకు సహాయం అందించేందుకు భారత నావికాదళ యుద్ధనౌకలు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

అంతకుముందు శనివారం, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) రవాణా చేస్తున్న రెండు భారత నౌకలకు ఇరాన్ అధికారులు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. వాటిలో ఒక నౌక ‘శివాలిక్’. నౌకా ట్రాఫిక్ పర్యవేక్షణ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, ఈ నౌక చివరిసారిగా గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో ఉన్నట్లు నమోదైంది. మార్చి 21 నాటికి అది తన గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో సముద్ర పరిస్థితులు, అలాగే భారతీయ నావికులు, నౌకల భద్రతను నిర్ధారించేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తాజా వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 668 మంది నావికులతో 24 భారత నౌకలు ప్రయాణిస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే హోర్ముజ్ జలసంధికి తూర్పు భాగంలో ఉన్న మూడు నౌకల్లో 76 మంది భారతీయ నావికులు ఉన్నట్లు పేర్కొంది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, నౌక యజమానులు, ఆర్పీఎస్ఎల్ ఏజెన్సీలు, విదేశాల్లోని భారత మిషన్లతో సమన్వయం కొనసాగిస్తూ అన్ని భారత నౌకలు, సిబ్బందిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 24 గంటల కంట్రోల్ రూమ్ ప్రారంభించినప్పటి నుంచి డీజీ షిప్పింగ్ మొత్తం 2,425 కాల్స్, 4,441 ఈమెయిళ్లను పరిష్కరించిందని తెలిపింది. అంతేకాకుండా చిక్కుకుపోయిన 223 మందికిపైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.

ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ మధ్య హోర్ముజ్ జలసంధి గుండా భారత నౌకలకు సురక్షిత మార్గం కల్పిస్తామని భారతదేశంలోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీ ధ్రువీకరించారు. భారత్‌తో ఉన్న దీర్ఘకాల స్నేహం, పరస్పర ప్రయోజనాలను ఆయన ప్రస్తావించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement