అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. క్షిపణులు, డ్రోన్ దాడులతో పశ్చిమాసియా 17 రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏడు మిత్రదేశాలు ట్రంప్‌కు షాకిచ్చాయి. ఇరాన్ పరిధిలోని హర్మూజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధనౌకలను పంపాలంటూ ట్రంప్ చేసిన సూచనను పలు మిత్ర దేశాలు తిరస్కరించాయి. దీంతో, ఇరాన్‌తో యుద్ధంలో కీలక పరిణామం నెలకొంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ పరిధిలోని హర్మూజ్ జలసంధి విషయంలో మిత్ర దేశాలకు సందేశాలు పంపించారు. ఇరాన్ పరిధిలోని హర్మూజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధనౌకలను పంపాలంటూ సూచనలు చేశారు. ఈ క్రమంలో ట్రంప్ సందేశంపై మిత్రదేశాలు జపాన్, ఆస్ట్రేలియా షాకిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా కేబినెట్ మంత్రి కేథరిన్ కింగ్ స్పందిస్తూ.. హర్మూజ్ జలసంధి వద్దకు కానీ, పశ్చిమాసియా ప్రాంతానికి కానీ తమ యుద్ధ నౌకను పంపేది లేదని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో యుద్ధనౌకను పంపాలని కోరుతూ అమెరికా నుంచి తమకు అధికారిక విన్నపమేదీ అందలేదని మరో ట్విస్ట్ ఇచ్చారు. తమ వార్‌షిప్‌ను పశ్చిమాసియాకు పంపే ఆలోచనేదీ లేదని ఆమె తేల్చి చెప్పారు. అయితే హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంత ముఖ్యమైందో తమకు తెలుసు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
జపాన్ ఝలక్..
మరోవైపు.. ట్రంప్ సందేశంపై జపాన్ ప్రధానమంత్రి సనాయీ తకాయిచి కూడా స్పందించారు. జపాన్ పార్లమెంటు వేదికగా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పశ్చిమాసియా సముద్ర జలాల మీదుగా రాకపోకలు సాగించే ఆయిల్ ట్యాంకర్లు, నౌకలకు భద్రత కల్పించేందుకు నౌకాదళాన్ని పంపే ఆలోచనేదీ లేదని ఆమె వెల్లడించారు.
బ్రిటన్ ఇలా..
అలాగే, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రాయల్ నేవీ డిస్ట్రాయర్లను పంపేందుకు లండన్ సిద్ధంగా లేదని స్టార్మర్ స్పష్టం చేశారు. బదులుగా, మైన్-హంటింగ్ డ్రోన్లను పంపి సహకరించవచ్చని తెలిపారు. ఇదే సమయంలో హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడం అత్యంత ముఖ్యం. కానీ సంక్షోభం మరింత పెరగకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. అంతేకాకుండా హర్మూజ్ జలసంధి విషయంలో కొన్ని అమెరికా మిత్ర దేశాలు కూడా ఆచితూచి స్పందిస్తుండగా, ఇంకొన్ని దేశాలు ముక్కుసూటిగానే నిరాకరిస్తున్నాయి. దీంతో, ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతున్న వేళ ట్రంప్‌నకు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.

అమెరికా ఒత్తిడి..
యుకే, జపాన్, ఆస్ట్రేలియా వెనక్కి తగ్గడంతో అమెరికా ఒంటరిగా ఇరాన్ నిర్బంధాన్ని ఎదుర్కొంటోంది. ఇది ఇంధన మార్కెట్లలో అనిశ్చితి పెంచుతోంది. ఈ నేపథ్యంలో మిత్రదేశాలు వెనక్కి తగ్గడంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. అయితే, చైనా ఎక్కువగా ఈ జలసంధి ద్వారా చమురు పొందుతున్న కారణంగా దాని రక్షణ బాధ్యతను కూడా వారు తీసుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు.


