నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు | Writer Nandini Sidhareddy wins Sahitya Akademi award | Sakshi
Sakshi News home page

నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Mar 16 2026 3:52 PM | Updated on Mar 16 2026 5:44 PM

Writer Nandini Sidhareddy wins Sahitya Akademi award

ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డి (nandini sidhareddy)ని వరించింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 2026 సంవత్సరానికి గాను ఆయన రాసిన "అనిమేష" కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులు, మానవీయ కోణాలను ఈ కవితా సంపుటిలో సిధారెడ్డి చిత్రించారు. సాహిత్య అకాడమీ అవార్డు కింద రూ. లక్ష నగదు, తామ్రపత్రం, శాలువాను ప్రదానం చేస్తారు. 

సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం రాష్ట్రానికే గర్వకారణమని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

 

మెదక్ జిల్లా బందారం గ్రామంలో  సిధారెడ్డి 1955లో జన్మించారు. ఆయన తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు.  హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.పూర్తిచేసి, ‘ఆధునిక తెలుగుకవిత్వంలో సూర్యుడు’ అనే అంశంపై ఎం.ఫిల్‌ (1981) పట్టా ఆ తర్వాత ‘ఆధునిక కవిత్వం, వాస్తవికత – అధివాస్తవికత’ పై పరిశోధన చేసి పి.హెచ్.డి (1986) పట్టా పుచ్చుకున్నారు. నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్‌గా పనిచేశారు. 

మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందనలు
తెలంగాణ మట్టి పరిమళాన్ని, సామాజిక చైతన్యాన్ని తన కలం ద్వారా జాతీయ స్థాయికి చేర్చిన ప్రఖ్యాత కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించడం పట్ల  పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రచించిన 'అనిమేష' వచన కవితా సంపుటికి గాను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును కేంద్రం ప్రకటించింది. సిధారెడ్డికి ఈ గౌరవం దక్కడం పట్ల  మంత్రి జూపల్లి హర్షం వ్యక్తం చేశారు.

నందిని సిధారెడ్డి కేవలం ఒక కవి మాత్రమే కాదు, తెలంగాణ సాంస్కృతిక పునర్వైభవానికి బాటలు వేసిన దార్శనికుడు. ఆయన రాసిన 'అనిమేష' కవితా సంపుటి ఆధునిక వచన కవిత్వంలో ఒక అద్భుత సృష్టి. ఈ పురస్కారం ఆయన సుదీర్ఘ సాహిత్య కృషికి దక్కిన సరైన గౌరవం. తెలంగాణ మట్టిలో పుట్టిన ఒక గొప్ప మేధావికి ఈ స్థాయి గుర్తింపు రావడం రాష్ట్రానికే గర్వకారణం అని పేర్కొన్నారు. ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు.

మలిదశ ఉద్యమంలో అక్షరాన్ని ఆయుధంగా మలచి ప్రజల్లో చైతన్యం నింపడంలోనూ ఆయన పాత్ర చిరస్మరణీయమని మంత్రి జూపల్లి కొనియాడారు.

Advertisement
 
Advertisement
Advertisement