ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆచూకీ, ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఇప్పట్లో తెరపడేనా? అసలు ఆయన బతికే ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? రష్యా అద్యక్షుడు పుతిన్ నీడలో రక్షణ పొందుతున్నాడనే మరో వార్తహల్ చల్ చేస్తోంది. ఇరాన్ సుప్రీం మోజ్తబా ఖమేనీ సేఫ్టీపై అగ్రనేతలు ఏమంటున్నారు? ఈ విషయాలపై కథనం.
అమెరికా, ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య యుద్ధం మూడవ వారంలోకి ప్రవేశించిన వేళ, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆచూకీ , ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు.
మోజ్తబా ఖమేనీ ఉనికిపై ఊహాగానాలు
ఇరాన్‌పై ఫిబ్రవరి 28న మొదలు పెట్టిన అమెరికా -ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అప్పటి సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ ఇతర కుటుంబ సభ్యులు మరణించారు. తండ్రి మరణం తర్వాత, 56 ఏళ్ల మోజ్తబా ఖమేనీ ఇరాన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే, యుద్ధం ప్రారంభంలో జరిపిన దాడుల్లో మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం కోమాలో ఉన్నారనే ఊహాగానాలు భారీగా వ్యాపించాయి. అయితే ఈ విషయాలను ఖండించిన ఇరాన్ మోజ్తబా గాయపడినప్పటికీ నాయకత్వ బాధత్యలను నిర్వహించే స్థితిలోనే ఉన్నారని ప్రకటించింది.
రష్యాలో చికిత్స ?
అయితే ఆయన రష్యాలో చికిత్స పొందుతున్నారని కువైట్ పత్రిక 'అల్-జరీదా' తెలిపింది. దీని ప్రకారం అమెరికా-ఇజ్రాయెల్ బాంబు దాడుల తర్వాత మోజ్తబాను అత్యంత రహస్యంగా ఒక రష్యన్ సైనిక విమానంలో మాస్కోకు తరలించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంలోని ఒక ప్రైవేట్ వైద్య సదుపాయంలో ఆయనకు శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం అక్కడే కోలుకుంటున్నారని సమాచారం. ఇరాన్‌లో దాడులు కొనసాగుతున్నందున భద్రతా కారణాల దృష్ట్యా ఆయన్ని రష్యాకు తరలించినట్లు తెలుస్తోంది.
ఇరాన్‌లోనే ఉన్నారా?
మరోవైపు 'ది సన్' పత్రిక కథనం మాత్రం మరోలా ఉంది మోజ్తబా ఇరాన్‌లోని సినా యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడుల్లో ఆయన రెండు కాళ్లు కోల్పోయారని, కాలేయం లేదా కడుపు భాగం తీవ్రంగా దెబ్బతిన్నదని, ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారని పేర్కొంది.
ట్రంప్ , నెతన్యాహు ప్రకటనలు
అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర అనుమానాలను రేకెత్తించాయి.ఆయన అసలు బతికే ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇప్పటివరకు ఎవరూ ఆయన్ని చూడలేదు. ఆయన బతికే ఉంటే, తన దేశం కోసం శరణు కోరడం మంచిదని వ్యాఖ్యానించారు. అంతేకాదు మోజ్తబా సమాచారం కోసం అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించడం గమనార్హం.
మరోవైపు ఇరాన్ నేత మోజ్తబా ఆచూకీపై తమ వద్ద సమాచారం ఉందంటూనే "ఆయన ప్రాణాలకు నేను ఎలాంటి భరోసా (లైఫ్ ఇన్సూరెన్స్) ఇవ్వలేనునీ, అయితే ఖమేనీ ఉన్న ప్రదేశం గురించి ఇజ్రాయెల్‌కు నిఘా సమాచారం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించడం ఈ ఊహాగానాలను మరింత సంక్లిష్టం చేసింది.
ఇరాన్ సైనిక కమాండర్లకు కూడా తమ కొత్త నాయకుడి నుండి ఎటువంటి ఆదేశాలు అందడం లేదని, దీంతో ఇరాన్ అంతర్గత గందరగోళం నెలకొన్నట్టు తెలుస్తోంది. మోజ్తబా అందుబాటులో లేని కారణంగా యుద్ధంపై ఆయనకు ఎటువంటి నియంత్రణ లేదని, కమాండర్లకు కూడా ఆయన స్థితిగతులపై స్పష్టత లేదని 'ది టెలిగ్రాఫ్' నివేదించింది.
(నెతన్యాహూ కాఫీ వీడియో : షాకింగ్ ‘డీప్‌ఫేక్’ చర్చ)
ఖమేనీ పరిస్థితి గురించి సీనియర్ అధికారులు కూడా అనిశ్చితంగా ఉన్నారని ఇరాన్ అధికారి ఒకరు ది టెలిగ్రాఫ్‌తో అన్నారు. "మోజ్తాబా గురించి ఎవరికీ ఏమీ తెలియదు, అతను బతికే ఉన్నాడా లేదా చనిపోయాడా లేదా ఎంత తీవ్రంగా గాయపడ్డాడో. అతను గాయపడ్డాడని చెప్పారు. అతను ఇక్కడ లేనందున అతనికి యుద్ధంపై నియంత్రణ లేదు. మెజారిటీ కమాండర్లకు, లేదా మరింత సరిగ్గా చెప్పాలంటే, అన్ని కమాండర్లకు అతని గురించి ఎటువంటి సమాచారం లేదు." అని ఇరాన్ సీనియర్ అధికారిన ఉటంకిస్తూ టెలిగ్రాఫ్ వెల్లడించింది.
అలాగే సుప్రీం లీడర్ పేరుతో విడుదలైన మొదటి ప్రకటన ఆయన రాసింది కాదని, భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ రాసి ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి మోజ్తబా ఖమేనీ ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ పరిస్థితి ఇరాన్ రాజకీయ , సైనిక వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇదీ చదవండి: అమ్మానాన్నకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ : ఎమోషనల్ వీడియో


