9వ తరగతి విద్యార్థులు అర్హులు
దరఖాస్తుల స్వీకరణకు నెలాఖరు వరకు గడువు
పాలకొండ రూరల్: విద్యార్థి దశ నుంచే అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ‘యువ విజ్ఞాని కార్యక్రమ్ (యువికా)–2026’ను నిర్వహిస్తోంది. విద్యార్థులకు సాంకేతికత, అంతరిక్ష పరిశోధన, అనువర్తనాలపై ప్రాథమిక స్థాయి నుంచి విజ్ఞానాన్ని అందించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని సైన్స్ ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి 9వ తరగతి చదువుతున్న భారతీయ విద్యార్థులు ‘యువ విజ్ఞాని కార్యక్రమ్’నకు అర్హులు.
ఇందులో పాల్గొనేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా.. మార్చి 31 వరకు గడువు ఉందని ఐస్రో అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను ఎంపిక చేసి వారికి రానున్న మే నెలలో14 రోజులు ప్రత్యేక వసతిగృహంలో ఉంచి శిక్షణ అందిస్తారు. ఇస్రో సెంటర్లలో ప్రాక్టికల్ సెషన్లు, ప్రాజెక్ట్‌లు, ఇంటరాక్టివ్ సెషన్లపై సంపూర్ణ అవగాహన కల్పించనున్నారు.
దరఖాస్తు చేయడం ఇలా...
అర్హులైన విద్యార్థులు https://jigyasa.iirs.gov.in/yuvika వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి యువికా – 2026 (yuvika 2026 Registration) లింక్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయదలచిన విద్యార్థి పేరు, తండ్రి పేరు, పాఠశాల వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. వీటితో పాటు వ్యక్తిగత, విద్య, ఇతర వివరాలతో దరఖస్తు పత్రాన్ని పూర్తి చేయాలి. అవసరమైన పత్రాలు (మార్క్‌షీట్లు, సర్టిఫికెట్లు) స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 8వ తరగతి మార్కులు, క్విజ్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఈ ఏడాది మే 11 నుంచి 22 వరకు శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంగల పాఠశాల విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ఆసక్తి గల విద్యార్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే ఆన్‌లైన్‌లో క్విజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
శిక్షణ కేంద్రం ఎంచుకోవాలి..
దేశ వ్యాప్తంగా సతీష్ ధావన స్పేస్ సెంటర్– శ్రీహరికోట, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్–హైదరాబాద్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్– డెహ్రాడూన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్–తిరువనంతపురం, యూఆర్ రావు శాటిలైట్‌సెంటర్– బెంగుళూరు, స్పేస్ అప్లికేషన్– అహ్మదాబాద్, నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్– షిల్లాంగ్, తదితర కేంద్రాల్లో ఎదో ఒక సెంటర్‌ను విద్యార్థి ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా విద్యార్థులు ఇస్రో శాస్త్రవేత్తలతో నేరుగా కలవడం, అక్కడి ల్యాబ్‌లను స్వయంగా సందర్శించడంతో పాటు స్పేస్‌టెక్ ప్రాజెక్టుల చేసే అవకాశం ఉంటుంది. పరిశోధనాత్మకత, సైన్స్ రంగాలకు చెందిన కొలువులపై ఆశక్తి ఉన్నవారు ఈ ఆవకాశం అందిపుచ్చుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
ఏప్రిల్ 13న మొదటి జాబితా..
ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే మొదటి జాబితా ఏప్రిల్ 13న విడుదల చేస్తారు. జిల్లా పరిధిలో గల 213 ఉన్నత పాఠశాలల ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తుల రిజిస్టేషన్ ప్రక్రియ సాగుతోంది. ఆసక్తి గల విద్యార్థులు గుర్తించాలి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈనెల 31లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
– పాటోజు బ్రహ్మాజీరావు, జిల్లా విద్యాశాఖాధికారి, పార్వతీపురం మన్యం
ఎంపికలో ప్రాధాన్యం..
యువికా ఎంపిక ప్రక్రియంలో మార్కులకు ఉండే ప్రాధాన్యతను విద్యార్థులు గుర్తించాలి. ముఖ్యంగా 8వ తరగతిలో వచ్చే మార్కులకు 50 శాతం, రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శనలు, ప్రతిభా పరీక్షల్లో తొలి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులకు 10 శాతం, స్కౌట్, ఎన్‌సీసీ విభాగాలకు చెందిన విద్యార్థులకు 5 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. ఎంపికైన విద్యార్థుల ఖర్చులు ఇస్రో భరిస్తుంది. దేశంలో ఉన్న ఏడు ఇస్రో కేంద్రాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ప్రాంత పరిధిలో ఉండే శ్రీహరికోట, హైదరాబాద్ కేంద్రాల్లో శిక్షణ పొందే అవకాశం ఉంటుంది.
– గిరడ లక్ష్మణరావు, జిల్లా సైన్స్ అధికారి, పార్వతీపురం మన్యం


