సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించాలని వైఎస‍్సార్‌సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పరిశీలకుల సమావేశం జరిగింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాలపై సజ్జల రామకృష్ణారెడ్డి, కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట‍్లాడుతూ.. ‘వైఎస్సార్‌సీపీ 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగుపెట్టింది. ప్రజలతో కలిసి, ప్రజల కోసమే పనిచేస్తూ పార్టీ ముందుకు సాగుతోంది. జగన్ వెంట నడిచే ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునే స్థాయిలో పార్టీ ఉంది. ప్రజల్లో వైఎస్సార్‌సీపీపై విశ్వాసం మరింత పెరిగింది.
పార్టీ భవిష్యత్ విజయానికి సంస్థాగత బలోపేతం అత్యంత అవసరం. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలి. అన్ని స్థాయిల్లో కమిటీలను త్వరగా పూర్తి చేయాలి. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు పరిశీలకులు సపోర్టింగ్ సిస్టమ్‌లా పనిచేయాలి. మన హయాంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి.
కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించాలి. టీడీపీ ఫేక్ ప్రచారం, పెయిడ్ క్యాంపెయినింగ్‌ను వాస్తవాలతో ఎదుర్కోవాలి. ఎన్నికల్లో విజయానికి బూత్ స్థాయి నిర్మాణం చాలా ముఖ్యం. ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి’ అని అన్నారు.



