‘బాబూ.. ఎంపీ మహేష్‌ తాట తీస్తావా?.. కేవలం డైలాగులేనా?’ | YSRCP Serious Comments On TDP MP Putta Mahesh Drugs Case | Sakshi
Sakshi News home page

‘బాబూ.. ఎంపీ మహేష్‌ తాట తీస్తావా?.. కేవలం డైలాగులేనా?’

Mar 16 2026 1:55 PM | Updated on Mar 16 2026 2:54 PM

YSRCP Serious Comments On TDP MP Putta Mahesh Drugs Case

సాక్షి, తాడేపల్లి: టీడీపీ లోక్‌సభ ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌పై చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ డ్రగ్స్‌ తీసుకుని అడ్డంగా దొరికితే, పట్టుబడితే హాట్‌లైన్‌ రాజకీయాలతో బెయిల్‌ ఇప్పించడమే కాకుండా, షోకాజ్‌ నోటీసు పేరిట డ్రామా చేస్తారా? అని ప్రశ్నించింది. కోడిని కోస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసు పెట్టి.. డ్రగ్స్ తీసుకునే వారిని వదిలేస్తారా? అంటూ ఘాటు విమర్శలు చేసింది.

వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌ వేదికగా..‘కోడిని కోస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్‌ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ డ్రగ్స్‌ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడితే హాట్‌లైన్‌ రాజకీయాలతో బెయిల్‌ ఇప్పించడమే కాకుండా, షోకాజ్‌ నోటీసు పేరిట డ్రామా చేస్తారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, నారా లోకేష్‌, హోం మంత్రి అనిత.. మీరు అనుసరించే చట్టం, న్యాయం, ధర్మం ఇదేనా? ఇలా చేసి సమాజానికి, యువతకు తప్పుడు సందేశం ఇస్తున్న మాట వాస్తవం కాదా?.  

హైదరాబాద్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ పాల్గొన్నారన్నది వాస్తవం కాదా? ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారన్నది వాస్తవం కాదా? డ్రగ్‌ నిర్ధారణ పరీక్షలను తారుమారు చేయడానికి యూరిన్‌ శాంపిల్స్‌లో భాగంగా యూరిన్‌ బదులు నీరు ఇచ్చారన్న ఆరోపణ కూడా ఉంది. చివరకు కొకైన్‌ తీసుకున్నట్టుగా రక్త పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ఇన్ని పక్కా ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని ఎంపీ పదవికి రాజీనామా చేయించాల్సింది పోయి, తేలుకుట్టిన సామెత మాదిరిగా మౌనం దాల్చడం, పైగా పలుకుబడిని ఉపయోగించి, బెయిల్‌ మీద తీసుకురావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. డ్రగ్స్‌ వ్యవహారాల్లో, మహిళలపై నేరాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే తాటతీస్తా అని పదేపదే చెప్తున్న మాటలు కేవలం డైలాగులు మాత్రమేనని, చేతల్లో శూన్యమని, మీ అసలు రంగు ఇదేనని మరోసారి రుజువు అయ్యింది.

  • కూటమికి చెందిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా మీకే స్వయంగా ఫిర్యాదు చేసినా కమిటీల పేరుతో ఇంకా ఇంకా డ్రామా చేస్తూనే ఉన్నారు.

  • టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళమీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే, పంచాయతీ చేశారు తప్ప నో యాక్షన్‌.

  • KGBV మహిళా ప్రిన్సిపల్‌ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌మీద కూడా నో యాక్షన్‌. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్‌ చేసిన గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ మీద కూడా నో యాక్షన్‌.

  • మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏ మీద నో యాక్షన్‌.

  • ఇక ప్రస్తుత టీటీడీ ఛైర్మన్‌, ఒక మహిళను మోసం చేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయినా నో యాక్షన్‌. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా మీకే లేఖ రాసినా టీటీడీ చైర్మన్‌లాంటి  పోస్టులో పెట్టారు.

కమిటీల విచారణ, షోకాజ్‌ నోటీసుల పేరిట చేస్తున్న డ్రామాలు ఇకనైనా కట్టిపెట్టి, డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ ఎంపీ చేత తక్షణమే రాజీనామా చేయించడంతోపాటు, వీళ్లందరి మీద చర్యలు తీసుకోండి. లేకపోతే మీ పార్టీని ప్రజలు క్షమించరు’ అంటూ ఘాటు విమర్శలు చేసింది. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement