అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎంచుకున్న టీం సభ్యులు సైతం అచ్చం ఆయన తరహాలోనే రోజుకో రీతిన మాట్లాడటంలో ఆరితేరారు. అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బిసెంట్ చేస్తున్న ప్రకటనలు దాన్నే నిరూపిస్తున్నాయి. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదరబోతున్నదని, తమ షరతులన్నిటికీ తలొగ్గటానికి ఆ దేశం సిద్ధపడిందని పలుమార్లు ఏకపక్షంగా ప్రకటించటం, అంతలోనే ఏదో సాకుతో అదనపు సుంకాలు విధించటం ట్రంప్ అలవాటు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేయనందు వల్ల భారత్‌పై విధించే సుంకాలు 500 శాతానికి కూడా చేరుకోవచ్చని పదిరోజులనాడు కూడా ట్రంప్ బెదిరించారు. స్కాట్ బిసెంట్ సైతం ఆ తోవనే పోయారు. కానీ ఇప్పుడు బెదిరింపుల పర్వం ఉపశమించినట్టు కనబడుతోంది.
భారత్‌పై విధించిన అదనపు సుంకాల్లో 25 శాతాన్ని తగ్గించబోతున్నామని బిసెంట్ ప్రకటించారు. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లు పడిపోయినందు వల్ల ఈ నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పారు. చమురు కొనుగోళ్లు తగ్గిన మాట వాస్తవమే అయినా, దాన్ని అసలు గుర్తించనట్టు ఎప్పటికప్పుడు కొత్త డిమాండ్లు పెట్టడం అలవాటు చేసుకున్న అమెరికా వైఖరి మార్చుకోవటం వెనక వేరే మతలబు ఉంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో మన దేశం రేపో మాపో వాణిజ్య ఒప్పందం కుదురుతుండటమే ఇందుకు కారణం. ఉక్రెయిన్‌పై 2022లో రష్యా దాడి తర్వాత అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆదేశంతో సంబంధాలు తెంచుకున్నాయి. అటు తర్వాత మన రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు పెరిగాయి. ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల్లో మనం రెండో స్థానంలో ఉన్నాం.
ప్రపంచం మునుపటిలా లేదు. ఏకపక్షంగా, అనాలోచితంగా ఆంక్షలు విధిస్తే స్వీయ నష్టాలు కూడా తప్పవు. ప్రపంచ దేశాలపై విధించిన ఆంక్షల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకుల్లో పడింది. తాజాగా డాలర్ విలువ నాలుగు నెలల కనిష్ఠస్థాయికి పడి పోయింది. అమెరికా బెదిరింపులకు దిగిన మొదట్లో మన దేశానికి చెందిన ప్రైవేటు సంస్థలు రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు తగ్గించిన మాట వాస్తవం. అప్పటికి రోజూ సగటున 17 లక్షల బ్యారెళ్ల ముడిచమురు కొనుగోలు చేస్తుండగా, మొన్న డిసెంబర్ నాటికి అది 12 లక్షల బ్యారెళ్లకు తగ్గింది. అమెరికా సంస్థలతో లావాదేవీలున్న కొన్ని భారత్ కంపెనీలు ఆంక్షలకు తలొగ్గటమే మంచిదని నిర్ణయించుకోవటం ఇందుకు కారణం.
కానీ రష్యా ప్రముఖ చమురు కంపెనీలైన రోజ్నెఫ్ట్, లుకోయిల్ నుంచి చమురు కొనుగోలు చేయరాదన్నది అమెరికా పెట్టిన ఆంక్షల్లో ఒకటి. దానికి విరుగుడుగా రష్యా వేరే కంపెనీలను రంగంలోకి దించి వాటిద్వారా భారత్‌కు ముడి చమురు ఎగుమతులు మొదలుపెట్టింది. వీటి ప్రభావం ఒకటి రెండు నెలల్లో కనబడుతుందనీ, అటుతర్వాత రష్యా నుంచి వచ్చే ముడిచమురు కొనుగోళ్లు యథాప్రకారం ఉంటాయని నిపుణుల అంచనా. చవగ్గా వచ్చే రష్యా ముడి చమురును వదులుకోవటం ఎవరికైనా అంత సులభం కాదు. రష్యా చమురుకూ, సౌదీ అరేబియా నుంచి కొనే చమురుకూ మధ్య బ్యారెల్‌కు దాదాపు 10 డాలర్ల వ్యత్యాసం కనబడుతున్నప్పుడు ఆంక్షలకు తలొగ్గాలని ఎవరూ అనుకోలేరు.
తమ డెయిరీ ఉత్పత్తులనూ, జన్యుపరంగా మార్పుచేసిన ఆహారధాన్యాలనూ భారత్ మార్కెట్‌లో విక్రయించేందుకు అనుమతించాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నందు వల్లే వాణిజ్య ఒప్పందం కుదరటంలో ఆలస్యం అవుతోంది. ఏదో వంకతో ఆంక్షలు విధిస్తే భారత్ దారికొస్తుందని అమెరికా భావన. ఈలోగా ఈయూ–భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదిరే అవకాశాలు కనబడటం అమెరికా జీర్ణించు కోలేకపోతోంది. అందుకే ఒకపక్క ఎఫ్‌టీఏను దృష్టిలో పెట్టుకున్నందు వల్లే భారత్ పట్ల ఈయూ మెతకవైఖరి ప్రదర్శించిందని విమర్శిస్తూనే, తాను విధించిన అదనపు సుంకాల్లో కోతకు సిద్ధపడుతోంది. అమెరికాతో ఒప్పందం కుదరటం మాటెలావున్నా, ప్రపంచ దేశాలన్నిటితో వాణిజ్య సంబంధాలు పెంపొందించుకునే ప్రస్తుత విధానాన్ని మన దేశం కొనసాగించటమే ఉత్తమం. ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే ధోరణి ఎప్పుడూ ప్రమాదకరమే!


