అచేతన లేదా అర్ధ చేతన స్థితిలో జీవచ్ఛవాల్లా బతుకీడుస్తూ మనుగడ సాగించే రోగుల విషయంలో ఏం చేయాలన్న అంశంలో స్పష్టత కొరవడిన నేపథ్యంలో బుధవారం సర్వోన్నత న్యాయస్థానం ఉత్తరప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల హరీశ్ రాణా అనే యువకుడి పరోక్ష కారుణ్య మరణానికి అనుమతిస్తూ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. చావు బతుకుల పొలిమేరల్లో కొట్టుమిట్టాడేవారి విషయంలో ఏం చేయాలన్న మీమాంస మన దేశానికే పరిమితమైనది కాదు. దాదాపు అన్ని సమాజాల్లోనూ దశాబ్దాలుగా ఎడతెగని చర్చ కొనసాగుతోంది. 27 దేశాలు మాత్రమే కారుణ్య మరణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చట్టాలు చేశాయి. వీటిలో ‘క్రియాశీల కారుణ్య మరణానికి’ కొన్ని మొగ్గు చూపగా, ‘పాక్షిక కారుణ్య మరణానికి’ మరికొన్ని అనుమతించాయి.
1973లో ముంబై కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్(కేఈఎం) ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న అరుణా రామచంద్ర శాన్‌బాగ్ అనే యువతి లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడి, మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి కోమాలోకి వెళ్లిన ఉదంతం అనంతరం ఈ విషయమై దేశంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఆమెను నాలుగు దశాబ్దాల పాటు ఆసుపత్రి సహ సిబ్బంది కంటికి రెప్పలా చూసుకున్నారు. ఈ పరిస్థితుల్లో 2009లో ఆమె స్నేహితురాలు పింకీ విరానీ... అరుణా శాన్‌బాగ్‌కు కారుణ్య మరణాన్ని ప్రసాదించమని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చివరకు అసాధారణ పరిస్థితుల్లో కారుణ్య మరణానికి అనుమతినీయటం రాజ్యాంగబద్ధమేనని 2011లో న్యాయస్థానం అభిప్రాయపడింది. కానీ రోగి తరఫు బంధువులు కోరనందున ఈ తీర్పు బాధితురాలికి వర్తించబోదని తెలిపింది.
ఎన్నో పరిమితులు విధించినా 2011 నాటి తీర్పు ఎన్నదగింది. అయితే 2018లో ‘కామన్ కాజ్’ దాఖలు చేసిన పిటిషన్ తర్వాత ‘జీవించే హక్కు’కు పూచీపడే రాజ్యాంగంలోని 21వ అధికరణంలో ‘హుందాగా మరణించే హక్కు’ కూడా ఇమిడి ఉన్నదని తెలిపింది. దీనికోసం ఒక చట్టం చేయాలని కేంద్రానికి సూచిస్తూ, ఈలోగా వర్తింప జేయటం కోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. కానీ ఇప్పటివరకూ ఆ చట్టం జాడలేదు. ఆచరణలో ఆ మార్గదర్శకాల వల్ల ఎదురవుతున్న ప్రతిబంధకాలపై ఒక స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేశాక 2023లో అవి మరింత సరళమయ్యాయి. కానీ వాటి అమలుకు అనుమతించటం ఇదే ప్రథమం.
పరోక్ష కారుణ్య మరణాన్ని అనుమతించటం విషయంలో నైతిక పరమైన సమస్యలు తలెత్తుతాయన్నది వాస్తవం. ఎందుకంటే గుండె, లేదా మెదడు ‘సజీవంగా’ ఉన్నట్టు వైద్యులు చెప్పాక చూస్తూ చూస్తూ అలాంటి రోగి మరణాన్ని ఎవరూ కోరుకోరు. ఏ క్షణమైనా కోలుకోవచ్చని ఆశిస్తారు. ప్రస్తుత కేసులో రోగి 13 ఏళ్లుగా అలాంటి స్థితిలోనే కొనసాగాడు. దీనిపై ఢిల్లీ హైకోర్టు అనుమతి నిరాకరించాక అతని తల్లితండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. తీర్పు వెలువరించినప్పుడు స్వయానా న్యాయమూర్తే కంటతడి పెట్టారంటే ఆయనలో సాగిన అంతస్సంఘర్షణ ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక కన్నవారి గురించి చెప్పేదేముంది?
తీర్పు వెలువరించిన రోజే మీడియాలో యూపీ ఉదంతం ఒకటి వచ్చింది. దాన్ని గమనిస్తే ఈ తరహా రోగుల స్థితిని అంచనా వేయటం ఎంత సంక్లిష్టమో తెలుస్తుంది. ‘బ్రెయిన్ డెడ్’ అయి కోమాలోకి వెళ్లిన 50 ఏళ్ల మహిళ కొద్ది నిమిషాల్లోనే మరణిస్తుందని వైద్యులు చెప్పటంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుని వెనక్కి తీసుకెళ్తుండగా రోడ్డుపై లోతైన గుంతలో అంబులెన్స్ చిక్కుకుంది. దాన్ని కదల్చటానికి ఇంజిన్‌ను హెచ్చించటంతో వాహనం కుదుపునకులోనై ఆ మహిళలో శ్వాస సాధారణ స్థాయికి చేరి, మాట్లాడటం మొదలైంది.
అందుకే అత్యంత జాగరూకత అవసరం. ‘మరణించడానికి గల హక్కు’ కాస్తా కొందరు స్వప్రయోజనపరుల వల్ల ‘బాధ్యత’గా మారిపోయే ప్రమాదం ఉంది. ఆస్తులపై కన్నేసి, లేదా చాకిరీ తప్పించుకునేందుకు అంతిమ దశలో ఉండేవారి చేత బలవంతంగా కారుణ్య మరణానికి అనుమతించాలన్న పత్రాలపై సంతకాలు చేయించే ప్రబుద్ధులు కూడా అక్కడక్కడ ఉంటారు. కనుక అన్ని కోణాల్లోనూ పరిశీలించాకే అనుమతి మంజూరు చేయటం అవసరం.


